కలం, ఆదిలాబాద్: రాయ్‌పూర్‌లో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ అండర్-18 సెంట్రలైజ్డ్ సెలక్షన్ ట్రయల్స్‌లో(SGFI Under-18 Trials) ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ జూడో క్రీడాకారులను జిల్లా కలెక్టర్ (Adilabad Collector) రాజర్షిషా శనివారం అభినందించారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. బ్రెజిల్‌లోని రియో డి జనీరో వేదికగా డిసెంబర్ 3 నుంచి 8 వరకు జరగనున్న ‘ఐఎస్ఎఫ్ జిమ్నాసియాడ్-2026’ టోర్నమెంట్‌కు భారత జట్టుకు ఎంపికైన మోటం హర్షవర్ధన్‌తో పాటు, సెలక్షన్ ట్రయల్స్‌లో మూడో స్థానం సాధించిన రామావత్ తరుణ్‌ను కలెక్టర్ శాలువాతో సత్కరించారు. మెమెంటో, ప్రశంసా పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి దేశం, రాష్ట్రంతో పాటు ఆదిలాబాద్ జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. క్రీడాకారులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్వో ఏ. దయానంద రెడ్డి, జూడో శిక్షకుడు నంగునూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

