కలం, మెదక్ బ్యూరో: ఎర్రవల్లి (Erravalli) భూముల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. శనివారం ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 325లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు రెవెన్యూ, సర్వే అధికారులు విడతలవారీగా నోటీసులు జారీ చేస్తున్నారు. మొత్తం 215 మంది రైతులకు నోటీసులకు సంబంధించిన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి విడత కింద సర్వే డిపార్ట్‌మెంట్ అధికారులు 50 మంది రైతులకు నోటీసులు అందజేశారు. ఈ నెల 21 నుంచి ఎర్రవల్లిలో భూ సర్వే ప్రక్రియ ప్రారంభం కానుందని, రైతులు తమవద్ద ఉన్న భూములకు సంబంధించిన ఆధారాలతో రావాలని సూచించారు. మొత్తం నాలుగు విడతల్లో ఈ సర్వేను పూర్తి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పట్టాదారు పాస్‌బుక్కులు ఇవ్వాలని రైతులు రిక్వెస్ట్
అధికారులు అందించిన నోటీసులను స్వీకరించిన రైతులు.. సర్వే ప్రక్రియకు తాము పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. “మా తాతల కాలం నుంచి ఈ భూములపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. గత కేసీఆర్ ప్రభుత్వంలో మాకు పట్టాలు, పాస్ బుక్స్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు జరుగుతున్న సర్వే అనంతరం తమ భూములకు కొత్తగా పట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసి ఆదుకోవాలి” అని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

