కలం, నిర్మల్: నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం (Munnuru Kapu Sangam) (పటేల్స్) ఆధ్వర్యంలో రూపొందించిన సభ్యత్వ నమోదు వెబ్సైట్ను రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మున్నూరు కాపుల జనాభాను అధికారిక గణాంకాలలో తక్కువగా చూపిస్తున్నారని పేర్కొన్నారు.
వాస్తవంగా మున్నూరు కాపుల జనాభా కోటి మందికి పైగా ఉంటే.. 20 లక్షల లోపుగా చూపించడం వాస్తవ విరుద్ధమని అన్నారు. మున్నూరు కాపులందరూ వెబ్సైట్ ద్వారా సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, శ్రీ గండి రామన్న దత్త సాయి ఆలయ చైర్మన్ కొట్టే శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

