కలం, వెబ్ డెస్క్: న్యూయార్క్ నగర వీధులు, పబ్లిక్ పార్కుల్లో హై-టెక్ పబ్లిక్ బాత్రూమ్లు అందుబాటులోకి వచ్చాయి. నగరంలో ఎంతోకాలంగా వేధిస్తున్న పబ్లిక్ టాయిలెట్ల (Public Toilets) కొరతను తీర్చడానికి మేయర్ జోహ్రాన్ మామ్దాని మొత్తం 17 స్మార్ట్ రెస్ట్‌రూమ్‌ల ఏర్పాటును అధికారికంగా ప్రారంభించారు. సుమారు 39 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని అందుబాటులోకి తెచ్చారు.
అయితే, ఈ స్మార్ట్ టాయిలెట్లలోని షాకింగ్ ఫీచర్ ఉంది. టాయిలెట్ లోపల ఎవరైనా 10 నిమిషాలు గడిచిన తర్వాత తలుపులు ఆటోమేటిక్‌గా తెరుచుకుంటాయి. ఎవరైనా ఎక్కువ సమయం గడపకుండా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేందుకే ఈ నిబంధన తెచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ సరికొత్త నిబంధనపై స్థానిక ప్రజల నుండి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మొబైల్ ఫోన్లలో రీల్స్ చూస్తూ గంటల తరబడి కూర్చునేందుకు ఇది స్థలం కాదని మేయర్ జోహ్రాన్ మామ్దాని స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లు లేదా కాంటాక్ట్‌లెస్ ట్రాన్సిట్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఆటోమేటిక్ రెస్ట్రూమ్ తలుపులను అన్‌లాక్ చేసుకోవచ్చు.
అయితే, టాయిలెట్ (Public Toilets) వాడుతున్న సమయంలో అకస్మాత్తుగా తలుపులు తెరుచుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, పబ్లిక్ బాత్రూమ్ల వినియోగానికి ఈ సమయం సరిపోతుందని పరిపాలనా యంత్రాంగం భావిస్తోంది. తొలి విడతగా 17 యూనిట్లు విజయవంతమైతే.. మరిన్ని ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్‌ను విస్తరించనున్నారు.

