ఫిర్యాదు చేస్తే కక్ష సాధిస్తారా?.. కూసుమంచి ఎస్ఐ‌పై కేశవపురం గ్రామస్తులు ఫైర్

కలం, ఖమ్మం బ్యూరో: రక్షణగా నిలవాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. న్యాయం చేయాలని ఉన్నతాధికారులను ఆశ్రయిస్తే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన వ్యవస్థలే అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నాయని కూసుమంచి (Kusumanchi) మండలం కేశవపురం గ్రామానికి చెందిన మందపల్లి శ్రీనివాసరావు, రజనీ, మందపల్లి రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఖమ్మంలోని ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని బాధితులు మీడియా ఎదుట ఎండగట్టారు. ​తమ గ్రామానికి చెందిన పోటు ప్రదీప్, పోటు తిరుమలరావు అనే వ్యక్తులు రాళ్ళు, కర్రలతో తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి గొడవకు దిగారని బాధితులు తెలిపారు. ఈ దౌర్జన్యంపై కూసుమంచి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో గతేడాది నవంబర్ 3న ఈ అంశంపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

​ఉన్నతాధికారులను ఆశ్రయించామనే కక్షతో కూసుమంచి ఎస్ఐ తమపైనే ఎదురుతిరిగి, అక్రమ సెక్షన్లతో కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఇటీవల కోర్టు నుంచి ఛార్జిషీట్ వచ్చిందనే పేరుతో స్టేషన్‌కు పిలిపించి మానసికంగా వేధిస్తున్నారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ​

మరోవైపు రెవెన్యూ అధికారులు సైతం పోలీసులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. తహసీల్దార్, సర్వేయర్ గ్రామానికి వచ్చి విచారణ పేరిట ప్రదీప్‌కు అనుకూలంగా, తమకు వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ఎస్సారెస్పీ కాలువ ఉన్న భూమిని కేవలం మట్టి రోడ్డుగా చూపిస్తూ, అబద్ధపు సర్వే సంఖ్యలతో రికార్డులు సృష్టించారని ధ్వజమెత్తారు. అధికారులు కుమ్మక్కై బనాయించిన అక్రమ కేసులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ భూ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>