ఘనంగా తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి చెన్నై భక్తుల కానుక

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ వైష్ణవ క్షేత్రం, ఏపీలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavam 2026) వైభవోపేతంగా కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలనుండి భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది భక్తులు  పాల్గొని మూలమూర్తితో పాటు ఉత్సవ మూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తిరుమాడ వీధుల్లో సాయంకాల సంధ్యా సమయంలో వివిధ వాహన సేవలతో శ్రీవారి దర్శనంతో భక్తులు పునీతులవుతున్నారు.

చెన్నై భక్తుల భక్తిపూర్వక కానుక..

బ్రహ్మోత్సవాల వేళ భక్తులు స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. తాజాగా  శ్రీవారి సేవలో చెన్నై భక్తులు శ్రీవారికి భక్తిపూర్వక కానుక సమర్పించారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం లక్షలాది మంది భక్తులు ఎంతగానో ఎదురుచూసే ‘గరుడ సేవ’. ఈ దివ్య వేడుకను పురస్కరించుకుని శ్రీవారికి సమర్పించేందుకు చెన్నైకి చెందిన ‘హిందూ ధర్మార్థ సమితి’ తరఫున 9 పవిత్ర గొడుగులు శుక్రవారం తిరుమలకు చేరుకున్నాయి.

ఏటా కానుకగా..

చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గొడుగులను కానుకగా సమర్పిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో సిద్ధం చేసిన 9 గొడుగులను ఆ సమితి ట్రస్టీ ఆర్.ఆర్. గోపాల్ జీ… టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు అధికారికంగా అందజేశారు. ఇలా స్వామివారికి గొడుగులు సమర్పించడం వారు వరుసగా కొనసాగిస్తున్న 22వ సంవత్సరం కావడం విశేషం.

మాడవీధుల్లో శ్రీవారి ఊరేగింపు..

కాగా, సెప్టెంబర్ 15న సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. తొలిరోజు శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. సెప్టెంబర్ 16న ఉదయం చిన్న శేష వాహనం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం అనంతరం రాత్రి 7 గంటలకు హంస వాహనంపై మలయప్ప స్వామివారు దర్శనం ఇచ్చారు. సెప్టెంబర్ 17న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>