తనుగుల హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

కలం, కరీంనగర్ :  కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల (Tanugula) గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో జరిగిన బొజ్జపల్లి రాజబాబు హత్య కేసును జమ్మికుంట పోలీసులు(Jammikunta Police) కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసుతో సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల విచారణ ప్రకారం.. మృతుడు రాజబాబు తన తల్లి లచ్చమ్మ(A-3) పేరిట ఉన్న భూమిని విక్రయించాలంటూ కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడేవాడు. గ్రామ పెద్దల సమక్షంలో భూమిని మూడు వాటాలుగా విభజించినప్పటికీ, మొత్తం భూమి తనకే కావాలని రాజబాబు పట్టుబట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో సెప్టెంబర్ 10న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మద్యం సేవించిన రాజబాబు తనుగులలోని బావ జూపాక శంకర్(A-1) ఇంటికి వెళ్లి తల్లి లచ్చమ్మ, అక్క కవితపై(A-2) దాడికి దిగినట్లు పేర్కొన్నారు. రాజబాబును వారించే క్రమంలో అక్కడ ఉన్న శంకర్ (A-1), చేతి వెంకటేష్ (A-4), జూపాక సతీష్ (A-5), మారపెల్లి రాజయ్య (A-6), జూపాక శంకర్ s/o లేట్ రామయ్య (A-7)లు అతడిని పట్టుకుని తీవ్రంగా కొట్టి మంచానికి కట్టేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం శంకర్ చున్నీతో రాజబాబు మెడ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

సాక్ష్యాల నిర్మూలనకు యత్నం

హత్య అనంతరం నిందితులు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి సైకిల్‌పై శంకర్ పొలానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ పార, గడ్డపారలతో గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టారని, ఎవరికీ అనుమానం రాకుండా పైభాగంలో మట్టి, తుమ్మ పొరకలు కప్పారని వెల్లడించారు. నేరానికి ఉపయోగించిన చున్నీ, మృతదేహాన్ని తరలించిన సైకిల్, గుంత తవ్వేందుకు ఉపయోగించిన పార, గడ్డపారలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: సీఐ

కుటుంబ, భూ వివాదాల విషయంలో ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని సీఐ రామకృష్ణ సూచించారు. సమస్యలను పోలీస్ స్టేషన్ లేదా న్యాయస్థానాల ద్వారా చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని కోరారు. కేసును వేగంగా ఛేదించిన సీఐ రామకృష్ణతో పాటు జమ్మికుంట పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>