డేటా సెంటర్లకు వేస్ట్ వాటర్.. తెలంగాణ స్మార్ట్ ప్లాన్!

కలం, తెలంగాణ బ్యూరో: అమెరికాలోని డేటా సెంటర్ల (Data Centers)కు నీటి, విద్యుత్ సరఫరాపై అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. నిరసనల కారణంగా అమెరికాకు చెందిన అనేక ఐటీ కంపెనీలు డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకున్నాయి. ఇప్పటికే పలు కంపెనీల సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపనలు జరగ్గా, మరికొన్నింటితో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. వీటికి భారీ స్థాయిలో అవసరమైన నీళ్లు, విద్యుత్‌ను సరఫరా చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో మూసీ పునరుజ్జీవం ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)ల ద్వారా శుద్ధి చేసిన సెకండ్ గ్రేడ్ ట్రీటెడ్ వేస్ట్ వాటర్‌ను సరఫరా చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. అత్తాపూర్, నాగోల్ ప్లాంట్ల ద్వారా రోజుకు సుమారు 530 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేసేలా రూపొందిన ప్లాన్‌కు అనుగుణంగా దాదాపు 98 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం కూడా జరగనున్నది. పరిశ్రమల అవసరాలను తీర్చడంతో పాటు జలమండలి సొంతంగా ఆదాయాన్ని ఆర్జించేందుకు ఈ ప్లాన్ దోహదపడనున్నది.

ఇతర కంపెనీలకు సైతం

రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ హబ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నది. ప్యూర్ (ఔటర్ రింగ్ రోడ్డు – రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలోని పెరీ అర్బన్) ఏరియాలో భారీ స్థాయిలో డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే అమెజాన్ వెబ్ సర్వీసెస్ యూనిట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన హైపర్ వాల్ట్ అనే కంపెనీ వెయ్యి మెగావాట్ల (ఒక గిగావాట్) సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ కోసం అవగాహనా ఒప్పందం కుదిరింది.

కంట్రోల్ ఎస్, ఎస్‌టీటీ గ్లోబల్, ఎన్‌టీటీ డేటా, సిఫీ, టిల్, మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, కాపిటల్ లాండ్ తదితర సంస్థలతో కూడా ఇప్పటికే ఎంఓయూలు కుదిరాయి. మొత్తం 11 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్లలో దాదాపు 5 గిగావాట్ల మేర యూనిట్‌ల స్థాపనకు దాదాపు గ్రౌండ్ వర్క్ క్లియర్ అయింది. ఒక్కో మెగావాట్‌కు దాదాపు 15 ఎంఎల్‌డీల చొప్పున నీరు అవసరమవుతుందని అంచనా. కేవలం డేటా సెంటర్లకు మాత్రమే కాక ఫార్మా సహా మిగిలిన పరిశ్రమలకు కూడా ఇదే నీటిని ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

2 వేల ఎంఎల్‌డీ వాటర్ బ్యాంక్

జలమండలి ఆధ్వర్యంలో ప్రస్తుతానికి రోజుకు 530 మిలియన్ లీటర్లను సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అత్తాపూర్ ప్లాంట్ 233 ఎంఎల్‌డీ, నాగోల్ ప్లాంట్ 290 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఉండగా.. మరో 39 ఎస్టీపీలతో సుమారు 1,900 ఎంఎల్‌డీల ట్రీటెడ్ వాటర్‌ బ్యాంక్‌ను నిర్వహించవచ్చన్నది జలమండలి భావన.

ప్రస్తుతానికి అత్తాపూర్, నాగోల్ ప్లాంట్ నుంచి రోజుకు 530 ఎంఎల్‌డీ చొప్పున ట్రీటెడ్ వాటర్‌ను పరిశ్రమలు, డేటా సెంటర్లకు సప్లై చేయడానికి రామచంద్రాపురం, పటాన్‌చెరు, బీహెచ్ఈఎల్, సుల్తాన్‌పూర్, గుండ్ల పోచంపల్లి, గాజులరామారం, జీడిమెట్ల, మౌలాలి తదితర రూట్ల మీదుగా పైప్‌లైన్ నిర్మాణం కావాల్సి ఉంది.

అత్తాపూర్ ఎస్టీపీ ద్వారా చందనవెల్లి, షాబాద్ ఏరియాలోని పరిశ్రమలకు నీటిని సరఫరా చేయొచ్చని.. నాగోల్ నుంచి మిగిలిన పరిశ్రమలకు దాదాపు 57 కి.మీ. పైప్‌లైన్‌తో సప్లై చేయొచ్చన్నది జలమండలి భావన. మొత్తంగా మూసీ పునరుజ్జీవనం ఫస్ట్ ఫేజ్‌తో దాదాపు 1,900 ఎంఎల్‌డీలను ఎస్టీపీల ద్వారాల సప్లై చేయొచ్చని జలమండలి భావిస్తున్నది. ఈ ఆలోచనతోనే డేటా సెంటర్లు ఎన్ని వచ్చినా నీటిని సప్లై చేయడానికి ఇబ్బంది లేదని ప్రభుత్వం ధీమాతో ఉంది.

జలమండలికి ఆదాయం

డేటా సెంటర్లు, పరిశ్రమలకు సరఫరా చేసే ట్రీటెడ్ వాటర్ ధరను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయకపోయినా.. తక్కువ ధరతో మొదలుపెట్టి, డిమాండ్ పెరిగిన తర్వాత రివైజ్ చేయాలని జలమండలి భావిస్తున్నది. ఇప్పుడు డొమెస్టిక్ అవసరాలకు సరఫరా చేస్తున్న నీటి ధర 5వేల లీటర్లకు రూ. 500 చొప్పున ఉండగా, ఇందులో సగానికంటే తక్కువ ధరకే డేటా సెంటర్లకు ఇవ్వాలని సర్కార్ ఆలోచిస్తున్నది.

ప్రారంభంలో ఒక కిలో లీటర్‌కు రూ.12 చొప్పున వసూలు చేస్తే రోజుకు 530 మిలియన్ లీటర్ల చొప్పున సంవత్సరానికి జలమండలికి రూ. 232 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఒకవేళ దీన్ని రూ.20గా ఫిక్స్ చేస్తే రూ.387 కోట్లు, రూ. 25గా ఫిక్స్ చేస్తే రూ.484 కోట్ల మేర సమకూరుతుంది. అమెజాన్ లాంటి కొన్ని డేటా సెంటర్లు సొంతంగానే ఎస్టీపీలను నిర్మించుకుంటున్నాయి.

7 మిలియన్ లీటర్ల ట్రీటెడ్ వాటర్‌ను సొంతంగానే రెడీ చేసుకుంటున్నది. మైక్రోసాఫ్ట్ సైతం 310 ఎంఎల్‌డీలలో కొంత సొంత ఎస్టీపీల ద్వారా సర్దుబాటు చేసుకుంటుంది. ఎలాగూ గోదావరి నీటిని మూసీకి డైవర్ట్ చేసేలా పైప్‌లైన్ నిర్మించాలన్న ప్రభుత్వ ఆలోచనతో నగరం తాగునీటి అవసరాలు తీరనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>