కలం, కరీంనగర్: భారతదేశ ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (Mokshagundam Visvesvaraya) జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ (Karimnagar) లోని వాసుదేవా హాస్పిటల్‌లో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ (డిస్ట్రిక్ట్ 137-A) ఆధ్వర్యంలో ‘ఇంజనీర్స్ డే’ (Engineers Day) వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు స్థానిక ఇంజనీర్లను క్లబ్ ప్రతినిధులు శాలువాలు, మెమంటోలు, వాచ్‌లతో ఘనంగా సత్కరించారు. సన్మానం పొందిన వారిలో ఇంజనీర్లు కోల అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, అల్లాడి ఆనంద్ కుమార్, శ్రీరాముల శ్రీనివాస్ ఉన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ అలగండుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి అందించిన సేవలు అసమానమైనవని కొనియాడారు. ముఖ్యంగా ఆటోమేటిక్ హైడ్రాలిక్ డ్యామ్ గేట్ల రూపకల్పనలో ఆయన చూపిన ప్రతిభతో పాటు, హైదరాబాద్‌లో మూసీ నది వరదల నివారణకు ఆయన అందించిన ఇంజనీరింగ్ పరిష్కారాలు చిరస్మరణీయమని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్-2 సాగర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రొ (PRO) పుల్లాల శ్యామ్, ఎల్.ఐ.సి ఎగ్జిక్యూటివ్ రత్నమాల, సిద్దిపేట డీఎస్పీ సదన్ కుమార్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

