కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (Alla Nani) గుండెపోటుతో మరణించడంపై సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా ఉండే ఆళ్ల నాని.. చనిపోయారనే విషయం తెలుసుకుని పార్టీలకు అతీతంగా పోస్టులు పెడుతున్నారు.
దిగ్భ్రాంతి కలిగించింది: సీఎం చంద్రబాబు
డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. 56 ఏళ్ల వయస్సులో ఆయన గుండెపోటుతో మనకు దూరమవడం బాధాకరమన్నారు. నాని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నానని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.
వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి: మంత్రి లోకేశ్
ఆళ్ల నాని గుండెపోటుతో మరణించారనే విషయం తెలుసుకుని మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివాదాలకు దూరంగా, అందరితో స్నేహపూర్వకంగా మెలిగే ఆళ్ల నానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రజా సేవకే అంకితమయ్యారు: విజయసాయి రెడ్డి
ఆళ్ల నాని మరణంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం వంటి కీలక పదవులు నిర్వహించిన నాని.. ప్రజా సేవకే అంకితమయ్యేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నానని.. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

