కలం, వెబ్ డెస్క్: సుప్రీం కోర్టులో హైడ్రా (HYDRAA)కు భారీ షాక్ తగిలింది. కంటోన్మెంట్ ఏరియాలోని 40 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుందని హైడ్రా వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఆ స్థలం శాంతారాం కన్స్ట్రక్షన్స్ కంపెనీకే చెందుతుందని హై కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్ట్ తీర్పు ఇచ్చిన 219 రోజుల తరువాత సుప్రీం కోర్టుకు రావడంపై జస్టిస్ దీపాంకర్ దత్తా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిటిషన్ ఆలస్యంగా దాఖలు చేశారంటూ వ్యాఖ్యానించింది.
ఆది నుంచి వివాదమే..
తెలంగాణ ప్రభుత్వం, శాంతారాం కన్స్ట్రక్షన్స్ కంపెనీకి మధ్య 40 ఎకరాలకు సంబంధించి వివాదం కొనసాగుతోంది. ఈ భూమిపై హై కోర్ట్ స్టే విధించి, అందులోకి ఎవరూ వెళ్లవద్దని ఆంక్షలు కూడా విధించింది. అయితే, హైడ్రా సిబ్బంది ప్రవేశించి నిర్మాణాలు కూలగొట్టడంపై హై కోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి కమిషనర్ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని కూడా తీర్పు వెలువరించింది. తాజాగా అదే భూమిపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా.. ఇక శాంతారాం కన్స్ట్రక్షన్స్ కంపెనీకే పూర్తి హక్కులు కట్టబెట్టింది.

