కలం, వెబ్ డెస్క్ : తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమావేశం ముగిసింది. తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ వహిస్తున్న కీలక పాత్రను కొనియాడిన ముఖ్యమంత్రి, వారి సంస్థపై తమకు గౌరవం ఉందని పేర్కొన్నారు. గతంలో ఫౌండేషన్ సహకారంతో కుతుబ్ షాహీ టూంబ్స్, ఇటీవల శాసనమండలి భవనాన్ని విజయవంతంగా పునరుద్ధరించుకున్నామని గుర్తుచేశారు.
మూసీ నది పునరుజ్జీవం, పరివాహక ప్రాంతాల అభివృద్ధితో పాటు నైట్ ఎకానమీకి అనుకూలంగా మార్చే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మూసీ తీరంలో ఉన్న చారిత్రక సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాలను వారసత్వ సంపదగా తీర్చిదిద్దేందుకు అగా ఖాన్ ఫౌండేషన్ సహకారం అందించాలని కోరారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనం నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అలాగే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ (Aga Khan)ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కేవలం 20 నిమిషాల దూరంలో, 30 వేల ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇది పర్యావరణహిత నెట్-జీరో సిటీగా రూపుదిద్దుకుంటుందని, దీనికి సింగపూర్ సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని వివరించారు. ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాలను ప్రత్యేకంగా గ్రీన్ జోన్‌గా కేటాయించామని, ఇక్కడ అమెజాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయని సీఎం (Revanth Reddy) వివరించారు.
Also Read : హయత్‌నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
Follow Us On: X(Twitter)

