కలం, వెబ్ డెస్క్ : సాధారణంగా రాజకీయ నాయకులు అధికారం, హోదా, హంగామాతో కనిపిస్తుంటారు. అయితే ముంబైకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) పరాగ్ షా (Parag Shah) మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించారు. దాదాపు రూ. 3,383 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న ఆయన ఒక రోజు పాటు యాచకుడి వేషధారణలో గడపడం చర్చనీయాంశంగా మారింది. చిరిగిన దుస్తులు ధరించి రోడ్డు పక్కన కూర్చొని భిక్షాటన చేస్తూ కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
సామాన్యుల జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నం
అధికారం, ఆర్థిక సౌకర్యాలు, విలాసవంతమైన జీవనానికి ఒక్కరోజైనా దూరంగా ఉండి సామాన్యుడి జీవితాన్ని స్వయంగా అనుభవించాలనే ఉద్దేశంతోనే ఈ అనుభవాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జైన ఆధ్యాత్మిక గురువు నమ్రముని మహారాజ్ సూచన మేరకు పరాగ్ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేకుండా రోజువారీ జీవితం సాగించే వారి పరిస్థితులను దగ్గరగా అర్థం చేసుకోవడం ఈ అనుభవం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.
సోషల్ మీడియాలో వైరల్‌గా ఫొటోలు, వీడియోలు
ఘాట్‌కోపర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరాగ్ షా (Parag Shah), 2024 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువను సుమారు రూ.3,383 కోట్లుగా వెల్లడించారు. దీంతో ఆయన దేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేలలో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తి ఒక్కరోజు యాచకుడి రూపంలో కనిపించడం ముంబైలో ఆసక్తిని రేకెత్తించింది.
రోజంతా భిక్షాటన అనుభవాన్ని పూర్తి చేసిన అనంతరం పరాగ్ షా తిరిగి సాధారణ దుస్తులు ధరించి స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సామాన్య జీవనంలోని కష్టాలు, అనుభవాలను తెలుసుకున్నట్లు సమాచారం. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆర్థికంగా అత్యంత సంపన్నుడైన ఓ ప్రజాప్రతినిధి ఇలా సామాన్యుడి జీవితాన్ని అనుభవించేందుకు ముందుకు రావడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. హీరోయిన్ ఎవరంటే!
Follow Us On : WhatsApp

