కలం, ముంబై: ముంబైలోని ఐకాన్ ల్యాబ్స్‌ను సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay).. తెలుగు సమాజ ప్రతినిధులతో కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముంబై ఆంధ్ర మహాసభ, జింఖానా అసోసియేషన్ ప్రతినిధులు ముంబైలో ప్రత్యేకంగా తెలుగు భవన్ ఏర్పాటు చేయాలన్న తమ చిరకాల ఆకాంక్షను బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు.
ముంబైలో వివిధ భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలు తమ భాష, సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసుకున్నారని ప్రతినిధులు తెలిపారు. అదే విధంగా తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు ముంబైలో తెలుగు భవన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. తెలుగు భవన్ ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ముంబైలో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

