కలం, ఖమ్మం బ్యూరో : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు (Munneru Vaagu) నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆదివారం నాటికి ప్రకాష్ నగర్ వంతెన వద్ద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగి మున్నేరు జలకళ సంతరించుకుంది. ప్రవాహ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మున్నేరుకు పెద్ద ఎత్తున వరద నీరు చేరడంపై ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు విస్తారంగా సాగునీరు అందుబాటులోకి రానుండటంతో పొలం పనులు వేగవంతం చేసుకునేందుకు రైతాంగం సమాయత్తమవుతోంది.

