కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) బ్రిక్స్ సదస్సులో భాగంగా అదనంగా 15 సమావేశాలు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కూటమి సభ్య దేశాల అధ్యక్షులందరితోనూ ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు జరిపినట్లు తెలిపాయి. భారత్‌తో కొనసాగుతున్న వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై సమీక్షించినట్లు వెల్లడించాయి. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. శని, ఆదివారాల్లో సదస్సు జరిగినప్పటికీ.. ప్రధాని మోదీ మాత్రం శుక్రవారం నుంచే ఢిల్లీకి వచ్చిన వివిధ దేశాధినేతలను కలవడం ప్రారంభించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్‌ను సమావేశమైన విషయం తెలిసిందే.
బ్రిక్స్ సదస్సు విజయవంతం..
18వ బ్రిక్స్ సదస్సుకు ఈసారి భారత్ ఆతిథ్యం ఇవ్వగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్రం రెండు నెలల ముందు నుంచే మొదలుపెట్టింది. భారత్ మండపాన్ని ఇందుకు వేదికగా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. దేశాధినేతలు తరలివస్తుండటంతో వారి భద్రతకు పెద్ద పీట వేస్తూ.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యవహరించింది. కేంద్ర విదేశాంగ, హోం శాఖ అధికారులు బ్రిక్స్ సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. వివిధ విభాగాల సమన్వయంతో బ్రిక్స్ సదస్సు విజయవంతంగా ముగిసింది.

