కలం, నిర్మల్: ఆశా వర్కర్ల(ASHA Workers) సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణిచివేస్తోందని సీఐటీయూ (CITU) జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మండిపడ్డారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మెన సురేష్ మాట్లాడుతూ.. తమ సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్‌కు వెళ్తున్న ఆశా వర్కర్లను బస్సుల నుంచి దించి అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వ నిర్బంధ చర్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ చర్యలకు నిరసనగా ఈ నెల 16న జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేపడతామని ప్రకటించారు. ఆశా వర్కర్లు, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు పి.గంగామణి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.సుజాతతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

