కలం, వెబ్ డెస్క్: ముంబైలో జరిగిన 52వ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ అవార్డ్స్ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Union Home Minister Amit Shah) దేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ, విదేశాంగ విధానాల్లో ‘ఇండియా ఫస్ట్’ సూత్రానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని చెప్పారు. 2014 తర్వాత దేశం పనితీరు ఆధారిత రాజకీయాల దిశగా ముందుకు సాగుతోందని వివరించారు.
భారత్ ఆర్థికంగా బలమైన స్థాయికి చేరుకుందని అమిత్ షా అన్నారు. తాజా త్రైమాసిక గణాంకాలను ప్రస్తావిస్తూ 7.8 శాతం జీడీపీ వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. భారతీయ భాషలకు మరింత గుర్తింపు లభిస్తోందని, దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన పలు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. ఆర్టికల్ 370, నక్సలిజం, ఈశాన్య ప్రాంతాల పరిస్థితిని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ల్యాబ్‌గ్రోన్ డైమండ్స్‌పై పరిశ్రమకు పిలుపు
ల్యాబ్‌గ్రోన్ డైమండ్స్ రంగంపైసైతం అమిత్ షా మాట్లాడారు. ప్రపంచ వజ్రాల మార్కెట్లో సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్నాయని, ఈ పరిణామాన్ని భారత పరిశ్రమ అవకాశంగా మలుచుకోవాలని సూచించారు. ల్యాబ్‌గ్రోన్ డైమండ్స్ తయారీ నుంచి ఆభరణాల రూపకల్పన, బ్రాండ్ల అభివృద్ధి, అంతర్జాతీయ మార్కెట్లలో షోరూమ్‌ల ఏర్పాటు వరకు మొత్తం విలువ గొలుసులో భారత్ కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం దేశీయ మౌలిక వసతులు, సాంకేతిక సామర్థ్యాలు, మూలధనం, పారిశ్రామిక నైపుణ్యాలను సమర్థంగా వినియోగించుకోవాలని పరిశ్రమ ప్రతినిధులకు సూచించారు.
దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ (Seva Sankalp Abhiyan) నిర్వహించనున్నట్లు అమిత్ షా తెలిపారు. ఎన్డీయే కూటమి, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. అక్టోబర్ 6, 2026 నాటికి మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకుంటారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
కీలక అంశాలకు ప్రస్తావించిన అమిత్ షా..
రామజన్మభూమి ఆలయం, కాశీ విశ్వనాథ్ కారిడార్, కేదార్నాథ్ పునరుద్ధరణ, మహాకాల్ లోక్ వంటి ప్రాజెక్టులను ఆయన ప్రస్తావించారు. దేశ భద్రతకు సంబంధించి సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలను కూడా ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను వివరించారు.

