కాంగ్రెస్‌లో కొనసాగింపు.. కొండా దంపతుల కీలక వ్యాఖ్యలు

కలం, వరంగల్ : మంత్రివర్గం నుంచి కొండా సురేఖను (Konda Surekha) తొలగించిన తర్వాత తొలిసారి కొండా దంపతులు వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీపై తమ వైఖరిని స్పష్టం చేస్తూ కొండా మురళి (Konda Murali) కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని, రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిగా చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

పదవులు శాశ్వతం కాదని, ఇవాళ ఉన్న పదవి రేపు ఉండక పోవచ్చని కొండా మురళి అన్నారు. అయితే తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కొండా సురేఖకు పదవి కొనసాగాలంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని సూచనలు వచ్చినప్పటికీ, ఆమె అందుకు అంగీకరించలేదని తెలిపారు.

పదవి కోసం సారీ చెప్పను..

తన పదవి పోయినా సరే క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కొండా సురేఖ స్పష్టం చేసినట్లు మురళి వెల్లడించారు. ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం నుంచి పలుమార్లు పిలుపులు వచ్చినప్పటికీ ఆమె వెళ్లలేదని తెలిపారు. పరకాల నియోజకవర్గ బాధ్యతలను సుస్మిత చూసుకుంటారని, వరంగల్‌లో తాను, సురేఖ పార్టీ కార్యక్రమాలను చూసుకుంటామని కొండా మురళి (Konda Murali) అన్నారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

ప్రత్యర్థులపై సురేఖ ఘాటు వ్యాఖ్యలు..

సమావేశంలో కొండా సురేఖ పలువురు రాజకీయ నేతలపై విమర్శలు గుప్పించారు. పార్టీలు మారుతూ పదవులు పొందుతున్న నేతల తీరును ఆమె ప్రశ్నించారు. గతంలో తమకు మద్దతు కోరిన కొందరు నేతలు ఇప్పుడు తమపైనే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బసవరాజు సారయ్య, నాయిని రాజేందర్‌రెడ్డిల వ్యాఖ్యలకు సురేఖ కౌంటర్‌ ఇచ్చారు. ముందుగా తమ అనుచరులపై గెలిచి చూపించాలని సవాల్‌ చేశారు. రాజకీయాల్లో కొందరు ఉదయం ఒక పార్టీలో ఉండి, మధ్యాహ్నానికి మరో పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. తాను గతంలో నమ్మిన నాయకుడి కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని సురేఖ గుర్తుచేశారు.

కాంగ్రెస్‌లోనే ఉంటూ.. కార్యకర్తలకు అండగా ఉంటా..

మంత్రి పదవి నుంచి తొలగించినందుకు బాధ లేదని, అయితే ఎలాంటి కారణం లేకుండా పదవి నుంచి తొలగించడం మాత్రం బాధ కలిగించిందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని కొండా దంపతులు స్పష్టం చేశారు. కడియం శ్రీహరి 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీలోకి పోయి ఎమ్మెల్సీ తీసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెల రోజులు కూడా ఆగకుండా ఇటు జంప్ అయ్యాడు.

గుండు సుధారాణి మీద ఆ రోజుల్లో అసమ్మతి పెడదామని అనుకుంటే, ఆమె వచ్చి కొండా మురళికి దండం పెడితే వదిలేసాం. మళ్లీ ఇప్పుడు వచ్చి KUDA చైర్మన్ కావాలని అంటే తీసుకోమని కొండా మురళి రాసిచ్చాడు. కానీ పదవి వచ్చినాక ఆమె కనీసం ఫోన్ కూడా చేయలేదు కొండా సురేఖ విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>