కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా కాంగ్రెస్ (Warangal Congress) అధిష్టానం దృష్టి సారించి.. అందుకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి కొండా సురేఖను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావడంపై వ్యూహాలు చేస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఫోన్ చేసి సురేఖను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని కోరినట్లు సమాచారం. మంత్రి పదవి నుంచి సురేఖ భర్తరఫ్ అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయంగా కొంత స్తబ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఇన్ చార్జ్ ఫోన్ కు ప్రాధాన్యం ఏర్పడింది. నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను సమన్వయంతో పాటు ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది.
మేయర్ పీఠంపై ఫోకస్
కార్పొరేషన్ కు జరగబోయే ఎన్నికల్లో మెజార్టీ విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ (Warangal Congress) వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలాన్ని పెంచడం, నాయకత్వాన్ని సమన్వయం చేయడం, స్థానికంగా నెలకొన్న విభేదాలను పరిష్కరించడం వంటి అంశాలపైనే ఫోక్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఎన్నికల్లో సురేఖ రాజకీయ అనుభవాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సుధారాణికి కీలక బాధ్యతలు
మరోవైపు మాజీ మేయర్ గుండు సుధారాణి(Gundu Sudharani)కి కుడా చైర్‌పర్సన్ బాధ్యతలు అప్పగించడం సిటీ రాజకీయాల్లో ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో మేయర్ అనుభవం ఉన్న సుధారాణికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా సిటీ నేతకు మరోసారి ప్రాధాన్యం లభించినట్లైంది. సురేఖకు అధిష్టానం నుంచి క్రియాశీలంగా పనిచేయాలని సూచనలు రావడం, సుధారాణికి కుడా చైర్‌పర్సన్ బాధ్యతలు దక్కడం ఒకే సమయంలో చోటుచేసుకోవడంతో పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
కార్యకర్తల్లో అయోమయం
సురేఖ (Konda Surekha) మంత్రి పదవి కోల్పోయిన తర్వాత వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో కొంత అయోమయం నెలకొంది. కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని సమన్వయపరచడం అధిష్టానానికి కీలకంగా మారింది. ఎన్నికల నాటికి నేతలు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కొండా నిర్ణయంపై ఉత్కంఠ
మీనాక్షి ఫోన్ నేపథ్యంలో సురేఖ తన భర్త కొండా మురళితో చర్చించిన అనంతరం నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపినట్లు సమాచారం. దీంతో ఆమె తిరిగి పూర్తిస్థాయిలో రాజకీయ కార్యకలాపాల్లోకి వస్తారా? మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బాధ్యతలను స్వీకరిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి నార్ల సుబ్రహ్మణ్యం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఆమె శనివారం వెళ్లి పరామర్శించారు.
వైద్యులను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించినట్లు సమాచారం. మొత్తంగా సురేఖకు అధిష్టానం నుంచి వచ్చిన తాజా సూచనలు, గుండు సుధారాణికి దక్కిన కీలక బాధ్యతలు, ముందున్న మున్సిపల్ ఎన్నికలు.. ఈ మూడు అంశాలు వరంగల్ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా..! అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.
Also Read : ధరణి భూ దోపిడీపై సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్?
Follow Us On: X(Twitter)

