ముకుందాపురంలో విషాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి

కలం, కోదాడ: రెండో శనివారం లభించిన పాఠశాల సెలవు.. ఆ ఇళ్లల్లో కోలుకోలేని శోకాన్ని నింపింది. స్నేహితుడితో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు పాఠశాల విద్యార్థులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం (Mukundapuram) వద్ద చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం..

శనివారం పాఠశాలకు సెలవు కావడంతో కోదాడకు చెందిన హరీశ్ నాయుడు, గుడిబండకు చెందిన లేఖ స్వరూప్ (ఇద్దరూ 9వ తరగతి) తమ మిత్రుడైన అనుదీప్‌ను కలిసేందుకు ముకుందాపురం గ్రామానికి వచ్చారు. ముగ్గురు కలిసి సరదాగా గడిపేందుకు సమీపంలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌ (Canal Accident) వద్దకు వెళ్లారు. నీటి ప్రవాహాన్ని గమనించకుండా ఈత కొట్టేందుకు కాలువలోకి దిగారు. కాలువలో నీటి ఉధృతి ఎక్కువ కావడంతో ముగ్గురు విద్యార్థులూ ఒక్కసారిగా కొట్టుకుపోవడం ప్రారంభించారు.

ఇది గమనించిన సమీప స్థానికులు వెంటనే స్పందించి అనుదీప్ అనే విద్యార్థిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే, ప్రవాహ తీవ్రతకు హరీశ్ నాయుడు, స్వరూప్‌లు నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి, పోలీసు బృందం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలువలో నీటి ప్రవాహాన్ని తగ్గించి గాలింపు చర్యలు చేపట్టారు. శోధన అనంతరం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కళ్లముందే ఎదిగొస్తున్న పిల్లలు అనంత లోకాలకు వెళ్లడంతో కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>