ఖమ్మంలో జనసేన శంఖారావం.. పవన్ కళ్యాణ్ మాస్ పొలిటికల్ ప్లాన్..!

కలం, ఖమ్మం బ్యూరో : ​ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం గ్రాండ్ విజయాన్ని సాధించి ఏపీ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పొలిటికల్ ఫోకస్‌ను తెలంగాణ వైపు మళ్లించారు. “జనసేన పుట్టిందే తెలంగాణ నేలపై” అన్న భావజాలాన్ని బలంగా వినిపిస్తూ, రాష్ట్రంలో పార్టీ యంత్రాంగాన్ని పునర్నిర్మించేందుకు ఒక పక్కా వ్యూహాత్మక మాస్ పొలిటికల్ ప్లాన్‌కు ఖమ్మం వేదికగా ‘జనసేన శంఖారావం’ (Janasena Shankharavam) శ్రీకారం చుట్టారు.

​హైదరాబాదులోని మణికొండలో నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు, నటుడు తనీష్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల చేరికల కమిటీని ఏర్పాటు చేసి డిజిటల్ మెంబర్‌షిప్‌లకు వేగం పెంచారు. ఈ క్రమంలోనే ‘జనసేన శంఖారావం’ (Janasena Shankharavam) పిలుపునివ్వడం, దానికి ముందే నకిరేకల్‌లో నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాల కార్యకర్తల ‘ఆత్మీయ సమ్మేళనం’ ఏర్పాటు చేయడంతో తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ ఒక్కసారిగా వేడెక్కింది.

జనసేన పొలిటికల్ స్కెచ్..

​ఉమ్మడి ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎంఎల్సీ బరిలో మాజీ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావును బరిలోకి దించడమే జనసేన వేసిన అతిపెద్ద పొలిటికల్ స్కెచ్. సరిహద్దు జిల్లా కావడం, ఏపీ రాజకీయాల ప్రభావం ఉండటం, పవన్ కళ్యాణ్‌కు ఇక్కడి యువతలో విపరీతమైన క్రేజ్ ఉండటం ఈ ప్లాన్‌కు ప్రధాన బలమై నిలుస్తోంది.

ఆదివారం ఖమ్మం ఎంబీ గార్డెన్స్‌లో నిర్వహించే సభా ప్రాంగణానికి పద్మశ్రీ “వనజీవి రామయ్య” పేరు నామకరణం చేసి పర్యావరణ, సామాజిక స్పృహ కలిగిన ప్రత్యామ్నాయంగా నిలిచే ప్రయత్నం చేస్తుండగా, నేడు నకిరేకల్ లో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ సైనికులను (క్యాడర్‌ను) ఒక్కటి చేసి గ్రౌండ్ లెవల్‌లో జోష్ నింపుతున్నారు. 25 ఏళ్ల పరిపాలనా అనుభవం ఉన్న ఉన్నత విద్యావంతుడిని బరిలోకి దించడం ద్వారా పట్టభద్రులు, ఉద్యోగులను ఆకట్టుకోవచ్చని పార్టీ నమ్ముతోంది.

మూడు పార్టీలకు పోటీ..?

​ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బిజెపిల మధ్య తీవ్రస్థాయిలో త్రిముఖ పోరు నడుస్తోంది. ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య జనసేన తనదైన ‘పవన్ మార్క్’ స్పేస్‌ను క్రియేట్ చేసుకునేందుకు నిరుద్యోగ సమస్యలు, జాబ్ క్యాలెండర్ అమలులో జాప్యం, రూ. 10వేల కోట్లకు పైగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బాకీలపై యువతలో ఉన్న అసంతృప్తినే అస్త్రాలుగా మలుచుకుంటోంది.

“తెలంగాణ భారత్‌లోనే భాగం… సామాజిక తెలంగాణే తమ సిద్ధాంతం” అని చాటుతూ జాతీయ సమగ్రత అంశాన్ని ముందుకు తెస్తున్నారు. జాతీయ స్థాయిలో బిజెపితో పొత్తులో ఉన్నందున, హైదరాబాద్ (GHMC), సరిహద్దు జిల్లాల్లో ఉన్న సీమాంధ్ర మూలాలున్న ఓటర్లను సమర్థవంతంగా ఏకం చేసి 2029 నాటికి ‘రెండు రాష్ట్రాల పొలిటికల్ ప్లేయర్’గా నిలవాలన్నది పవన్ యోచనగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పవన్ ‘పవర్ స్కెచ్’ వర్కవుట్ అవుతుందా..?

​అయితే, ఈ పవన్ ‘పవర్ స్కెచ్’ తెలంగాణలో ఏమేరకు వర్కవుట్ అవుతుందనేదే అసలైన ప్రశ్న. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉండగా, బీఆర్ఎస్, బీజేపీలు స్థిరమైన ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. వీరిని తట్టుకుని నిలబడేందుకు జనసేనకు పోలింగ్ బూత్ స్థాయి యంత్రాంగం లేకపోవడం పెద్ద సవాలుగా మారింది. ఏపీలో సాధించిన 100% విక్టరీ బూస్టప్, విఆర్ఎస్ తీసుకుని ప్రజల్లోకి వచ్చిన గడల శ్రీనివాసరావు సామాజిక ఇమేజ్, టీడీపీ-బీజేపీ మద్దతుదారుల సహకారం లభిస్తే ఎన్నికల రేసులో జనసేన గట్టి పోటీని ఇవ్వగలదు.

​మొత్తానికి ఖమ్మం ‘శంఖారావం’ నుండి నకిరేకల్ ‘ఆత్మీయ సమ్మేళనం’ వరకు జనసేన వేస్తున్న వేగవంతమైన అడుగులు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చలనానికి దారితీశాయి. ‘జనవాణి’ ద్వారా ప్రజా సమస్యలపై గళమెత్తుతూ, క్షేత్రస్థాయి బూత్ కమిటీలను బలోపేతం చేసుకోగలిగితే… ఈ పట్టభద్రుల ఎంఎల్సీ పోరు రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పొలిటికల్ ఫ్యూచర్‌ను, పవన్ వ్యూహాల సత్తాను చాటే తొలి పెద్ద పరీక్షగా మారనుందని పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు ఖమ్మం జిల్లా ప్రజలు, జన సైనికులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>