కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఇటీవల విపరీతంగా ట్రెండ్ అవుతున్న “1980s రెట్రో ఫొటో” (Retro Photo Scam) క్రేజ్‌ను ఉపయోగించుకొని కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) హెచ్చరించింది. సాధారణ ఫొటోలను 1980ల నాటి వింటేజ్ స్టైల్‌లోకి ఉచితంగా, అపరిమితంగా మార్చుకోవచ్చంటూ వాట్సాప్, ఎస్‌ఎంఎస్ , సోషల్ మీడియా వేదికగా నేరగాళ్లు కొన్ని లింకులను పంపుతున్నారని వెల్లడించింది.
సదరు లింక్‌లపై క్లిక్ చేయగానే, అవి గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌కు కాకుండా థర్డ్ పార్డీ అన్ అఫీషియల్ వెబ్ సైట్లకు తీసుకెళ్తాయని తెలిపింది. అక్కడ ఒక APK ఫైల్ ను డౌన్‌లోడ్ చేయమని కోరతాయని పేర్కొంది. దానికి పర్మిషన్ ఇస్తే వ్యక్తిగత బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందని హెచ్చరించింది. పర్మిషన్ ఇచ్చిన వెంటనే బ్యాంకింగ్ వివరాలు, ఎస్ఎంఎస్‌ల రూపంలో వచ్చే ఓటీపీలు సులభంగా చోరీ అవుతాయని స్పష్టం చేసింది. కాబట్టి తెలిసీ తెలియని థర్డ్ పార్టీ APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకూడదని సూచించింది.
సైబర్ మోసాల నుంచి రక్షణకు సూచనలు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ మోసాల నుంచి రక్షణకు పలు సూచనలు చేసింది. దీని ప్రకారం.. యాప్స్‌ను అధికారిక యాప్ స్టోర్ల నుంచే మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనుమానాస్పదంగా కనిపించే APKలను ఇన్‌స్టాల్ చేయకూడదు. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన అనుమానాస్పద యాప్స్‌ను తొలగించి, వాటికి ఇచ్చిన పర్మిషన్లను వెంటనే చెక్ చేయాలి. ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్, బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ వెల్లడించకూడదు. ఫోన్‌తో పాటు అందులోని యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలి. ఎస్ఎంఎస్, వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలి. సైబర్ మోసానికి గురైన వారు వెంటనే 1930కు కాల్ చేయాలని, లేదంటే 8712672222 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని TGCSB సూచించింది.

