కలం, కరీంనగర్ బ్యూరో: అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా దళిత బంధు కింద ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ నాయకులు బండ అశోక్ ఆధ్వర్యంలో శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని హరిప్రసాద్ సందర్శించి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. దళిత బంధు పథకం రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొదటి విడతలో లబ్ధి పొందని వారితో పాటు అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి వెంటనే పథకాన్ని వర్తింపజేయాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో దళిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక దళిత బంధు అమలులో ఎందుకు జాప్యం చేస్తుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా అర్హత ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. దళితుల హక్కుల సాధన కోసం దీక్ష చేస్తున్న నియోజకవర్గ నాయకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు బుర్ర నటరాజ్, సురేష్, సంతోష్ యాదవ్, దీటి శిరీష రమేష్, జిల్లా నాయకులు ఎంబీ సల్మా, జంగ అపర్ణ, దాసరి అంజలి, గౌతమి, రంగరవేణి లక్ష్మణ్, శ్రీరాముల రమేష్, కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, అంబాల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

