కలం, బజార్హత్నూర్ : సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మాజీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. బజార్హత్నూర్ (Bajahatnoor) మండలం గిరిజాయి సర్పంచ్ పెందూర్ అరవింద్, భూతాయి (కే) సర్పంచ్ మడావి జైతు, ధర్మపురి సర్పంచ్ ఆర్క యాదవరావు, సీనియర్ నాయకుడు కుమ్ర మారుతి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోయం బాపురావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలోనే గిరిజన గ్రామాలకు రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, పోడు భూములకు పట్టాలు వంటి సౌకర్యాలు అందుతున్నాయని అన్నారు. ముగ్గురు సర్పంచులు కాంగ్రెస్ లో చేరడంతో మండలంలో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మాజీ బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, అందూర్ సర్పంచ్ పెందూర్ పృథ్వీరాజ్, మైనార్టీ సీనియర్ నాయకుడు షేక్ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

