కాంగ్రెస్ అంటేనే కమిషన్, కరప్షన్.. డీకే అరుణ ఫైర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్, కరప్షన్ అంటూ మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) ఫైర్ అయ్యారు. శనివారం దేవరకద్ర (Devarkadra) నియోజకవర్గం కొత్తకోట (Kothakota) లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ, కరెంటు కోతలతో రైతన్నలు అగచాట్లు పడుతున్నారంటూ రైతు దీక్ష నిర్వహించారు.

అంతకుముందు చిన్నచింతకుంట మండలం అప్పంపల్లిలో అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. రైతు నిరసన దీక్షను ఉద్దేశించి డీకే అరుణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావడానికి అనేక ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిందన్నారు. పాలమూరు జిల్లా సస్య శ్యామలం కావడానికి ఉద్దేశించిన సాగునీటి ప్రాజెక్టులైన పాలమూరు రంగారెడ్డి, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయని ఆమె తెలిపారు. కాంగ్రెస్ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయారన్నారు.

వెయ్యి రోజుల పాలనకు సంబరాలు చేసుకుంటున్నారు. ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ అమలు చేశారా?, రైతులందరికీ రుణ మాఫీ చేశారా? అంటూ నిలదీశారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైతు భరోసా రూ. 15 వేలు అన్నారని, కానీ ఆ హామీ పక్కన పడేసారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలా బీజేపీ బోగస్ మాటలు చెప్పకుండా, ప్రతి క్వింటాల్‌కు వెయ్యి రూపాయల బోనస్ అని చెప్పి ఇస్తుందన్నారు. కానీ కాంగ్రెస్ బోగస్ మాటలను ప్రజలు నమ్మి మోసపోయారని ఆమె అన్నారు. బీజేపీ రైతులకు ఎరువుల సబ్సిడీ అందిస్తుందని, ఒక్కో రైతుకు పది వేల రూపాయలు ఆదా అవుతుందని ఆమె వివరించారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు రూ. 15వేల రైతు భరోసా ఏమైందని ప్రశ్నించారు. రైతులు రోడ్లు ఎక్కే పరిస్తితి వచ్చిందంటే.. సీఎం సిగ్గుపడాలనీ, మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప, చేతలు గడప దాటడం లేదని డీకే అరుణ విమర్శించారు.

కరెంట్ కూడా ఇవ్వకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని, కొడంగల్ ప్రజలు మళ్ళీ రానివ్వరని తెలిసి, అక్కడ మాత్రమే కరెంట్ ఇస్తూ పక్షపాతం చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. పాలమూరు రైతులకు 6 గంటలు కూడా నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారిందన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా.. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మాటలలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి మించిపోయాడని ఆమె దుయ్యబట్టారు.

ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములన్నీ రేవంత్ రెడ్డి బ్రదర్స్ వే అంటూ ఆమె చెప్పుకొచ్చారు. భూములు సంపాదించుకునేందుకు అధికారంలోకి వచ్చారా, పరిపాలన చేయడానికి వచ్చారా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ దోచుకుంటే, భూ భారతిలో 22A పేరిట పట్టా భూములను, నిషేధిత జాబితాలో పెట్టి కాంగ్రెస్ పార్టీ దోపిడీకి తెర లేపిందన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కుర్చీలు కాపాడుకునేందుకు సీఎం, మంత్రులు ఎవరికి వారు జిమ్మిక్కులు చేస్తున్నారు తప్ప పరిపాలన చేయడం లేదన్నారు. కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు అవినీతిలో కూరుకుపోయాయని, అవినీతి, మరక లేని పాలన ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్నారనీ ఆమె తెలిపారు. విద్యుత్ శాఖ పై రివ్యూ నిర్వహించి, రైతాంగానికి నిరంతరం విద్యుత్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చెందకండి పోరాటంలో బీజేపీ అండగా ఉంటుంది, పోరాడి సాధించుకుందాం అంటూ భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జాతీయ కిషన్ మోర్చా సభ్యులు గాలి మధుసుదన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నారాయణ, లోక్ నాథ్ రెడ్డి, పద్మజ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, భారత్ భూషణ్, శ్రీనివాస్ రెడ్డి, అనుగ్నరెడ్డి, బలరాం రెడ్డి, రాజశేఖర్, రామకృష్ణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరసింహ, రమేష్, శ్రీనివాసులు, మల్లేష్, సురేందర్ రెడ్డి, సాయి, మాధవ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రమేష్, గాయత్రి సత్యం సాగర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>