కలం, వెబ్ డెస్క్ : పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం, సంఘీభావం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమ్మిళితత్వం, సహకారం, ఏకాభిప్రాయం వంటి ప్రాథమిక సూత్రాలపై తమ నిబద్ధతను బ్రిక్స్ దేశాలు మరోసారి స్పష్టం చేశాయి. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న బ్రిక్స్ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఢిల్లీ ప్రకటనలో (BRICS Delhi Declaration) పలు కీలక అంశాలను ప్రస్తావించాయి. ప్రపంచ శాంతి, సమానత్వం, సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి.
మూడు కీలక స్తంభాలపై సహకారం
రాజకీయ, భద్రతా సహకారం, ఆర్థిక-ద్రవ్య సహకారం, సాంస్కృతిక-ప్రజల మధ్య సంబంధాలు అనే మూడు ప్రధాన స్తంభాల ఆధారంగా బ్రిక్స్ కార్యకలాపాలను మరింత విస్తరించాలని సభ్య దేశాలు సంకల్పించాయి. సభ్య దేశాల మధ్య పరస్పర అవగాహనను పెంచడంతో పాటు, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఏకాభిప్రాయం, పరస్పర గౌరవం బ్రిక్స్ సహకారానికి పునాదులుగా కొనసాగనున్నాయి.
మరింత న్యాయమైన ప్రపంచ వ్యవస్థకు పిలుపు
ప్రపంచ పాలనా వ్యవస్థలో అన్ని దేశాలకు సముచిత ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని బ్రిక్స్ దేశాలు గుర్తించాయి. మరింత ప్రాతినిధ్యంతో కూడిన, న్యాయమైన అంతర్జాతీయ వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేయాలని పేర్కొన్నాయి. బహుపాక్షిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడంతో పాటు, అవసరమైన సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రపంచ సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవాలని స్పష్టం చేశాయి.
ప్రజల ప్రయోజనమే ప్రధాన లక్ష్యం
సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత ఆర్థిక వృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే బ్రిక్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రధాన లక్ష్యమని ప్రకటనలో పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. శాంతి, అభివృద్ధి, సమానత్వం, భాగస్వామ్యంతో కూడిన భవిష్యత్తు కోసం బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని ఢిల్లీ ప్రకటన స్పష్టం చేసింది.

