సభకు రాకుండానే రూ. 22 కోట్లు దండుకున్న కేసీఆర్: దామోదర్ రావు

కలం, కరీంనగర్ బ్యూరో: శాసనసభకు హాజరుకాకుండానే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ (KCR) రూ. 22 కోట్లు ప్రజాధనాన్ని దండుకున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి అవెలి దామోదర్ రావు (Aveli Damodar Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం కరీంనగర్ జిల్లా డీసీసీ కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యాక ఏఐసీసీ కార్యదర్శి, ఎంపీ చామల ఆదేశాల మేరకు కరీంనగర్, సిద్దిపేట జిల్లాల ఇంచార్జీగా ఆయన మొదటిసారి మీడియాతో మాట్లాడారు. ​ఈ సందర్భంగా  దామోదర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు అసెంబ్లీ సెషన్లు జరిగితే కేసీఆర్ ఒక్కసారి కూడా సభకు హాజరుకాలేదని, అయినా జీతం కింద రూ. 12 కోట్లు, సెక్యూరిటీ కింద రూ. 10 కోట్లు చొప్పున మొత్తం రూ. 22 కోట్లు తీసుకున్నారని విమర్శించారు.

స్పీకర్‌పై వ్యాఖ్యలు.. చర్యలు తీసుకోవాలి

సభలో ప్రజాసమస్యలపై మాట్లాడే అవకాశాలు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు (BRS leaders) యత్నించారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్‌ను దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎంఎల్సి తాతా మధును వెంటనే పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటించిన ప్రాంతాన్ని బీజేపీ పసుపు నీళ్లతో శుద్ధి చేస్తే, ఇక్కడ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన దళితులపై బీఆర్ఎస్ నాయకులు గుండాలతో దాడి చేయించడమే కాకుండా, పసుపు నీళ్లు చల్లి శుద్ధి కార్యక్రమం నిర్వహించడం వారి అహంకారానికి, దళిత వ్యతిరేకతకు నిదర్శనమని మండిపడ్డారు.

దళితుల పట్ల వివక్షకు స్వస్తి పలకాలి

2026 జెన్-జెడ్ కాలంలో కూడా ఇటువంటి అంటరానితనాన్ని ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. దళిత సమాజానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 1000 రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు, రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేసి చూపించిందని తెలిపారు.

కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దేశంలో మళ్లీ దొరతనాన్ని, అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. స్పీకర్ పై, దళితులపై వారు ప్రదర్శిస్తున్న దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

బీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు

మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లపాటు సాగిన గడీల పాలన వైఖరిలోనే బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా వీధి రౌడీల లాగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తే మళ్లీ పాతకాలపు గడీల పాలన వస్తుందని ప్రజలు గ్రహించారని, అందుకే వారిని శాశ్వతంగా పక్కనబెట్టాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా చైర్మన్ మడుపు మోహన్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎం.డి. తాజుద్దీన్, ఎస్టీసెల్ అధ్యక్షుడు బానోతు శ్రావణ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కంకణాల అనిల్ కుమార్, కుంభాల రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>