కలం, వెబ్ డెస్క్ : నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు సంబంధించిన సరిహద్దు ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA Raids ) కీలక చర్యలు చేపట్టింది. జమ్మూకశ్మీర్‌లోని (Jammu and Kashmir) పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. పాకిస్థాన్‌లో ఉన్న LeT హ్యాండ్లర్లు, స్థానిక ఓవర్‌గ్రౌండ్ వర్కర్ల (OGWs) మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తోంది.
10 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
కుప్వారా, కుల్గాం, బండిపోరా, బారాముల్లా, సోపోర్ ప్రాంతాల్లో మొత్తం 10 ప్రదేశాల్లో NIA అధికారులు తనిఖీలు (NIA Raids) నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దు నుంచి చొరబడిన ఉగ్రవాదులకు స్థానికంగా సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల పాత్రను నిర్ధారించడంతో పాటు, మరిన్ని ఆధారాలను సేకరించడమే సోదాల ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా అనుమానితుల ఇళ్లు, వారికి సంబంధించిన ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లభించిన పలు వస్తువులు, పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
OGW అరెస్టుతో మొదలైన దర్యాప్తు
ఈ కేసు తొలుత శ్రీనగర్‌లోని (Srinagar) జకూరా పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది. అనంతరం NIA కేసును తిరిగి నమోదు చేసి దర్యాప్తును చేపట్టింది. మార్చి 31, 2026న LeTతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ OGWను అరెస్టు చేయడంతో విచారణకు కీలక ఆధారం లభించింది. అతని వద్ద నుంచి హ్యాండ్ గ్రెనేడ్, సజీవ తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
చొరబాటుదారులకు సహకారంపై ఆరా
పాకిస్థాన్ ఆధారిత LeT హ్యాండ్లర్లకు, స్థానిక సహచరులకు మధ్య సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని NIA పేర్కొంది. చొరబడిన ఉగ్రవాదులకు సమాచార మార్పిడి, వారి కదలికలకు సహకారం, దాచిపెట్టడం, ఆశ్రయం కల్పించడం, గూఢచర్య కార్యకలాపాల్లో స్థానిక నెట్‌వర్క్ పాత్రపై అధికారులు దృష్టి సారించారు. సోదాల సమయంలో లభించిన మరిన్ని నేరారోపణకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని NIA వెల్లడించింది.
Also Read : మంచం మీద నుంచే మైండ్ గేమ్: ఫిరూజ్జా దెబ్బకు చెస్ వరల్డ్ షాక్!
Follow Us On : WhatsApp

