పేదల కార్డులో పెద్దలెందరో.. అర్హతలపై అనుమానాలెన్నో!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేషన్‌ కార్డుల (Ration Cards)పై కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్నది. తెలంగాణలో కోటి 15 లక్షల కుటుంబాలు ఉంటే, కోటి 6 లక్షల కుటుంబాలకు (92 శాతం) కార్డులు జారీ చేయడం.. జనాభా 3.55 కోట్లు ఉంటే, 3.42 కోట్ల మందికి (96 శాతం) సన్న బియ్యం అందుతుండడంతో రాష్ట్రంలో అందరూ పేదలేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ట్యాక్స్ పేయర్స్, ఉద్యోగులు, పెన్షనర్లు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్, వివిధ రంగాల ప్రొఫెషనల్స్‌కూ రేషన్ కార్డులు జారీ అయినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

గతంలో వైట్, పింక్ రేషన్ కార్డులు (Ration Cards) ఉండేవి. కానీ ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఒక్కటే ఉన్నది. దాన్ని బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన) కుటుంబాలకు ప్రభుత్వం అందజేస్తున్నది. ఆ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. అయితే సంపన్న కుటుంబాలకు సైతం తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, వాళ్లూ సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నారనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కార్లలో వచ్చి మరీ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చాలా సంక్షేమ పథకాలకు వైట్ రేషన్ కార్డు ప్రామాణికంగా ఉండడంతో అనర్హులకు సైతం ఫలాలు అందుతున్నాయని, ఫలితంగా రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నదని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించింది. కార్లలో తిరిగే, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే వాళ్లకూ రేషన్ కార్డులు జారీ అయ్యాయని ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీ నేతలూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో భవిష్యత్తులో ఏపీఎల్ (దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న) కుటుంబాలకు వేరే కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ రెండున్నరేండ్లలో 16 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. గత ప్రభుత్వం చేయలేని పనిని తాము చేశామంటూ స్మార్ట్ కార్డుల జారీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే లబ్ధిదారుల్లో చాలా మంది అనర్హులు ఉన్నారన్నా ఆరోపణలు వస్తున్నాయి.

వైట్ రేషన్ కార్డు పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధన ప్రకారం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షన్నర కుటుంబ వార్షిక ఆదాయం మాత్రమే ఉండాలి. స్థిరాస్తుల విషయంలో మూడున్నర ఎకరాల తరి (మాగాణి), ఏడున్నర ఎకరాల మెట్ట భూమి ఉండాలి. కానీ ఈ నిబంధనలేవీ వైట్ రేషను కార్డుల జారీలో అమలు కావడం లేదు.

అర్హుల గుర్తింపులో విఫలం

అర్హులైన ప్రతి కుటుంబానికి వైట్ రేషన్ కార్డు జారీ చేస్తున్నామన్నది సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ వాదన. అర్హులైన వారికి ఇవ్వాల్సిందేనని, కానీ అర్హత లేనివారికి ఇవ్వడమే కరెక్టు కాదన్నది శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్య. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోకాపేట్ గేటెడ్ కమ్యూనిటీల్లోని వారికీ వైట్ రేషను కార్డులు ఉన్నాయన్నది ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట. ఉచితాల పేరు మీద సంక్షేమ పథకాల ద్వారా ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదనేది హైకోర్టు కామెంట్.

తెల్ల రేషన్ కార్డులపై ఇలాంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శాసనమండలిలో శుక్రవారం ఈ ప్రస్తావన వచ్చింది. వైట్ రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే మంజూరు చేస్తున్నామని, భవిష్యత్తులో ఏపీఎల్ (దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న) కుటుంబాలకు వేరే కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర జనాభా 3.55 కోట్లుగా ఉన్నట్టు కులగణన సర్వేలో తేలితే, అందులో 3.42 కోట్ల మందికి ప్రతి నెలా ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తున్నది.

ప్రభుత్వంపై భారం

ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం పొందడానికి వైట్ రేషన్ కార్డు ప్రామాణికం. సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందేందుకే ఇదే కీలకం. కానీ ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లుగా ఉన్నా, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్నా, లగ్జరీ కార్లలో తిరుగుతున్నా, ప్రభుత్వ ఉద్యోగులైనా.. ఇలాంటి వాళ్లందరికీ వైట్ రేషన్ కార్డులు ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో సంక్షేమ పథకాలకు సకాలంలో నిధుల విడుదల ఇబ్బందికరంగా మారింది.

మరోవైపు బోగస్ లబ్ధిదారులు జాబితాల్లోకి ఎక్కడంతో ప్రజాధనం దుర్వినియోగమవుతున్నది. ఇదే అంశాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం శుక్రవారం సభలో మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎల్, బీపీఎల్ కార్డులు వేర్వేరుగా ఉండేవని, ఇప్పుడు అలాంటి సిస్టమ్ తెస్తే అర్హులైన లబ్ధిదారులకు క్రమం తప్పకుండా లబ్ధి అందించే వీలు కలుగుతుందని, అర్హత లేనివారిని ఫిల్టర్ చేయడానికి అవకాశం ఉంటుందని సూచించారు. ‘మీ సేవ’ అప్లై చేసుకోవడమే ఆలస్యం.. అందరికీ కార్డులు అందుతున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు.

మండలిలో వాడీవేడి చర్చ

అర్హులకు ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందించడంలో ఎలాంటి తప్పు లేదని, కానీ అనర్హులకు అందకుండా నియంత్రించాలన్నది మండలి చైర్మన్ సహా సభ్యుల అభిప్రాయం. మండలిలో శుక్రవారం రేషన్ కార్డులపై మాట్లాడిన పలువురు సభ్యులు ఈ అంశాన్నే ప్రస్తావించారు. రాష్ట్రంలో కేవలం 9 లక్షల కుటుంబాలకు మాత్రమే వైట్ రేషన్ కార్డులు (Ration Cards) లేవు. కానీ తలసరి ఆదాయం మాత్రం ప్రభుత్వ లెక్కల ప్రకారమే నాలుగున్నర లక్షలు దాటింది. ప్రభుత్వ ఉద్యోగులు 12 లక్షలు ఉన్నట్లు స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కే ప్రకటించారు.

ఇంకోవైపు దాదాపు 11 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారంటూ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం గతేడాది మార్చి నాటికే రాష్ట్రంలో ట్యాక్స్ పేయర్ల సంఖ్య 30 లక్షలు దాటింది. ఇన్ని రకాల అధికారిక గణాంకాలు ఉండగా రాష్ట్రంలో 96% మందికి సన్న బియ్యం అందే అర్హత, దాదాపు 92% కుటుంబాలకు వైట్ రేషన్ కార్డు అర్హత ఎలా ఉంటుందనే దానికి మంత్రులు, అధికారుల నుంచి సమాధానం కరువైంది. ఈ నిబంధనల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని మంత్రి ఉత్తమ్ కౌన్సిల్ వేదికగా చెప్పక తప్పలేదు.

అనర్హులపై హైకోర్టు ఆందోళన

ప్రభుత్వం సరైన నియంత్రణ పాటించని కారణంగానే అనర్హులకు సైతం ఉచిత పథకాల ప్రయోజనం కలుగుతున్నదని, రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నదని, ప్రజాధనం దుర్వినియోగమవుతున్నదని హైకోర్టు పలు ఉదాహరణలతో ప్రభుత్వానికి చివాట్లు పెట్టడమే కాకుండా ఆవేదన వ్యక్తం చేసింది.

పన్ను చెల్లింపుదార్ల కష్టార్జితాన్ని అనర్హులకు ప్రభుత్వం దోచిపెడుతున్నదని, కోటీశ్వరరులు సైతం ఉచితాలను అనుభవిస్తున్నారని, ఇది భవిష్యత్తు తరాలకు ప్రమాదకరంగా మారనున్నదని జస్టిస్ భీమపాక నగేశ్ వ్యాఖ్యానించారు. మొబైల్ సిమ్ కార్డు జారీ మొదలు అనేక అవసరాలకు ఆధార్ కార్డును అనుసంధానం చేస్తున్న టెక్నాలజీని వినియోగస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న వేర్వేరు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల డేటాను, రేషన్ కార్డు వివరాలను ఇంటర్‌లింక్ చేసి ఫిల్టర్ చేయడంలో అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం కరువైంది.

మంత్రి ఉత్తమ్ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో 96% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిగానే నిర్ధారణ అవుతున్నది. మరోవైపు ఫోర్-వీలర్స్, ట్యాక్స్ పేయర్ల సంఖ్య, తలసరి ఆదాయం.. వైట్ రేషన్ కార్డు నిబంధనలకు పొసగడం లేదు. ఇన్ని ఉన్నా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు చోద్యం చూస్తున్నారనేది ప్రజాప్రతినిధుల సందేహం.

30 లక్షల మంది ట్యాక్స్ పేయర్లు

గత ఆర్థిక సంవత్సరం (2024-25) రాష్ట్రంలో 30.57 లక్షల మంది ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించారు. వీరంతా ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేవారే. వీరిలో 17.56 లక్షల మంది జీరో పన్నుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారు. వార్షికాదాయం ప్రకారం వీరంతా ఐటీ చెల్లింపు పరిధిలోకి వచ్చేవారైనందునే ఐటీ రిటర్న్స్ సబ్‌మిట్ చేశారు. ట్యాక్స్ డిడక్షన్ కోసం సేవింగ్స్ చూపించి, జీరో ట్యాక్స్ పేమెంట్ పరిధిలోకి వెళ్లారు.

Also Read : బ్రిక్స్ అతిథులకు ఇండియన్ టేస్ట్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>