కలం, ఖమ్మం బ్యూరో : అక్రమ ఇసుక, పశు రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ (Rohit Raj) అధికారులను ఆదేశించారు. శుక్రవారం అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన ఆయన, సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి రికార్డులను, స్టేషన్ పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు.
గంజాత్ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. పెట్రోలింగ్, బ్లూకోట్స్ వాహనాలతో నిరంతరం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష, నాట్ గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దర్యాప్తులో సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీలక్ష్మి, ఎస్‌హెచ్‌ఓ విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

