కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు (Yellandu) ప్రధాన మార్గంలో లారీ సృష్టించిన బీభత్సానికి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మండల పరిధిలోని సాయన్నపేట వద్ద శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాచలానికి చెందిన పల్నాటి నరేంద్ర కుమార్, ఆయన భార్య స్వప్న కేసముద్రంలో ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు.
విధి నిర్వహణ ముగించుకుని తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో భద్రాచలం వెళ్తుండగా, ఇల్లందు వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఎదురుగా కారును బలమైన వేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు తీవ్రంగా దెబ్బతిని, అందులో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయ దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను 108 అత్యవసర వాహనంలో ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

