కలం, జగిత్యాల: 2023 ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు దేవయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్లో జిల్లా మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డు దేవయ్య, జిల్లా అధ్యక్షుడు మచ్చ నారాయణ మాట్లాడారు.
ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజలకు సేవలందించి అప్పులపాలైన మాజీ సర్పంచులను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమని దేవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తమ డిమాండ్లపై వెంటనే స్పందించాలని కోరారు. మాజీ సర్పంచులందరికీ నెలకు రూ.10,000 పెన్షన్ అందించాలన్నారు. కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డుల ద్వారా ఉచిత కార్పొరేట్ వైద్యం కల్పించాలని కోరారు. ఉచిత బస్సు పాస్ సౌకర్యంతో పాటు అర్హులకు ఇళ్ల స్థలాలు, నిర్మాణం చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ సర్పంచులకు ఓటు హక్కు కల్పించాలని కోరారు.
సమయానికి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని, గ్రామాభివృద్ధి నిధులను దారిమళ్లించవద్దని సంఘం జిల్లా అధికార ప్రతినిధి ఎన్నం కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డిమాండ్లు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుమ్మని బాల ముకుందం, నాయకులు బుర్ర మల్లేశం గౌడ్, మర్రిపెల్లి నారాయణ గౌడ్, అంకతి గంగాధర్, పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, శేఖర్, సలీం, మోహన్ రావు, లావణ్య, లతశ్రీ తదితరులు పాల్గొన్నారు.

