కలం, వెబ్ డెస్క్: అటవీ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అటవీ సంరక్షణను మరింత బలోపేతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) పిలుపునిచ్చారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రాణాలను పణంగా పెడుతున్న అటవీ సిబ్బంది భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. శుక్రవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Forest Martyrs Day,) సందర్భంగా హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ స్మారక చిహ్నం వద్ద మంత్రి జూపల్లి, అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వన్య ప్రాణుల వేట కోసం అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి మరణించిన చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ కుటుంబానికి రూ. 30 లక్షల చెక్కును అందించారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. అటవీ రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. అటవీ నేరాలు, కలప అక్రమ రవాణా, అటవీ ఆక్రమణలు, వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో నిరంతర చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అటవీశాఖను బలోపేతం చేయడానికి 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (ఎఫ్బీవోలు), 15 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు (ఎఫ్ఆర్వోలు), 18 అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఏసీఎఫ్లు), ఇతర కేటగిరీల్లో కలిపి మొత్తం 1,516 ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
2014 నుంచి జూలై 2026 వరకు 1,06,685 ఓఆర్ (Offence Report) కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీటిలో రూ.55.99 కోట్ల విలువైన కలపకు సంబంధించిన కేసులు ఉన్నాయని, రూ.160.75 కోట్ల కంపౌండింగ్ ఫీజు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి 19,482 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అదనంగా 31,523 యూడీఓఆర్ కేసులు నమోదు చేసి, రూ.70.72 కోట్ల విలువైన కలపను స్వాధీనం చేసుకుని కలప డిపోలకు తరలించినట్లు తెలిపారు. 11,824 అటవీ ఆక్రమణ కేసులు కూడా నమోదయ్యాయని వెల్లడించారు.
ఫ్రంట్లైన్ సిబ్బందికి ఆయుధాల ప్రతిపాదన..
అటవీ రక్షణ విధుల్లో ఉన్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఫ్రంట్లైన్ సిబ్బందికి ఆయుధాలు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు మంత్రి తెలిపారు. అటవీ ఆక్రమణలు, కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల వేట, ఇతర వ్యవస్థీకృత అటవీ నేరాలను అరికట్టడంతో పాటు సిబ్బంది వ్యక్తిగత భద్రతకు ఆయుధాలు అవసరమని చెప్పారు. ఫ్రంట్లైన్ సిబ్బందికి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అందించేందుకు రూ.4.095 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ స్థాయిలో పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు.
సిబ్బందికి రక్షణ కల్పించడంతో పాటు కమ్యూనికేషన్, వాహనాలు, సాంకేతిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇచ్చే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి వివరించారు. అటవీ సంరక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రతి అటవీ అధికారి, ప్రతి ఫ్రంట్లైన్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. అటవీ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ అటవీ సంపదను మరింత బలోపేతం చేయాలని, వన్యప్రాణులకు సురక్షితమైన ఆవాసాలు కల్పించాలని, ప్రజలకు–ప్రకృతికి మధ్య సమతుల్యత సాధిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, పీసీసీఎఫ్ (HoFF) వినయకుమార్, పీసీసీఎఫ్ (డెవలప్మెంట్) రత్నాకర్ జోహరి, టీజీఎఫ్డీసీ- వీసీ అండ్ ఎండీ సునీతా భగవత్, ఇతర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు.

