కలం, వెబ్ డెస్క్ : అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు అధ్యక్షతన రెండో రోజు 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఫైళ్ల క్లియరెన్స్ ఆలస్యం కావడం, సమావేశానికి కొందరు అధికారులు గైర్హాజరు కావడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫైళ్ల పెండింగ్ జాబితాను ఒక్కొక్కరిగా చదువుతుండగా సంబంధిత అధికారులు రాలేదని గుర్తించిన ఆయన, 12 గంటలు కూడా సమావేశంలో కూర్చోలేరా అంటూ క్లాస్ తీసుకున్నారు. సమావేశంలో పూర్తి ఫోకస్ పనిచేసేందుకే ముందే ఫోన్లు తీసుకురావద్దని స్పష్టం చేశామని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రులు కూడా ఈ విషయాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి కీలక సమీక్ష జరిపారు. సంక్షేమ పథకాలను ఏయే తేదీల్లో ప్రకటిస్తున్నామనే వివరాలతో ఒక స్పష్టమైన సంక్షేమ క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించారు. కేవలం నగదు పంపిణీ చేయడమే కాకుండా, ఆ నిధులను లబ్ధిదారులు సరైన రీతిలో ఎలా ఉపయోగించుకోవాలో వారిలో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
వీటితో పాటు కులవృత్తులకు ప్రాధాన్యత ఇస్తూ విలువ ఆధారిత అభివృద్ధి దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ప్రతి చేనేత, చేతివృత్తుల కేంద్రాన్ని సందర్శకులను ఆకట్టుకునేలా ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు’గా తీర్చిదిద్దాలని అధికారులను స్పష్టంగా ఆదేశించారు.

