కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు జరిగిన ఉద్రిక్తతలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు (KTR-Harish Rao), సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డిలపై హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసులు లైంగిక కేసు నమోదు చేశారు. అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద విధుల్లో ఉన్న తమతో వారు అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘర్షణ సమయంలో కేటీఆర్, హరీశ్ రావు సహా ఇతర బీఆర్ఎస్ నేతలు టీషర్టులు విప్పి తమ ముందు అర్ధనగ్నంగా నిలబడ్డారని మహిళా కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా పోలీసులను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ ఘటనలో మహిళా పోలీసులకు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు కలిగాయని అన్నారు. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352 తదితర సెక్షన్లతో పాటు 3(5) కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇప్పటికే మరో కేసు నమోదు
అసెంబ్లీ బయట పోలీసులతో జరిగిన ఘర్షణకు సంబంధించి కేటీఆర్, హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలపై సైఫాబాద్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. పోలీసులతో వాగ్వాదం, విధులకు ఆటంకం కలిగించడం, దురుసుగా ప్రవర్తించడం వంటి ఆరోపణలపై వీడియో ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

