కలం, నల్లగొండ: బీఆర్ఎస్ అంటేనే అబద్ధాల పార్టీ అని, ఆ పార్టీకి ‘ఆల్ ఇండియా అబద్ధాల నాయకుడు’ కేటీఆర్ (KTR) అని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం (Vemula Veeresham) ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కేటీఆర్, పత్రికల్లో వచ్చిన ఆధారాలను, నిజా నిజాలను సైతం ఆర్టిఫిషియల్ ఫోటోలు, మార్ఫింగ్ చిత్రాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావులకు అసెంబ్లీ నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. చట్టాలు తెలిసి కూడా పోలీసు సిబ్బందిపై దాడులకు తెగబడటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
22-ఏ భూములపై చర్చకు భయపడ్డారా?
శాసనసభలో 22-A భూముల అక్రమాలపై చర్చ జరుగుతుంటే, అందులో పాల్గొనే ధైర్యం లేక కేటీఆర్ పారిపోయారని విమర్శించారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని, లాజిస్టిక్స్ పార్క్ పేరుతో కేటీఆర్, ఆయన బంధువులు వందల ఎకరాల విలువైన భూములను దోచుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. “గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన భూ దోపిడీ, విధ్వంసాలకే పరిమితమైంది. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతోంది.” అని వేముల వీరేశం చెప్పుకొచ్చారు.

