‘మైల పార్టీ’గా బీఆర్ఎస్‌?: దళిత సంఘాల సంచలన నిర్ణయం!

కలం, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల తొలిరోజే తమ నిరసనతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్న బీఆర్ఎస్ (BRS) ప్లాన్ రివర్స్ కొట్టింది. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి వ్యవహరించిన తీరు, స్పీకర్‌ను పరుష పదాలతో దూషించడం, ఆ తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ సమీపంలోని రోడ్లను పసుపు నీళ్లు, పాలతో శుద్ధి చేయడం వంటి ఘటనలు.. దళిత ప్రజా సంఘాలకు ఆగ్రహం తెప్పించింది.

అసెంబ్లీ వేదికగా ఎస్సీ ఎమ్మెల్యేలంతా ఒకే స్వరంతో బీఆర్ఎస్ ను, దాని అధినేత కేసీఆర్‌ను తప్పుపట్టారు. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికే పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. త్వరలో జాతీయ ఎస్సీ కమిషన్‌ను సైతం పలువురు దళిత ప్రజా ప్రతినిధులు ఆశ్రయించాలనుకుంటున్నారు. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా దళిత ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించేలా ఆలోచనలు మొదలయ్యాయి. దళిత విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, మేధావులు, కళాకారులు.. ఇలా అన్ని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలకు కసరత్తు జరుగుతున్నది.

ఎన్నికల్లో ఓడించడమే టార్గెట్

స్పీకర్‌ను దూషించడం, రోడ్లను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం వంటి ఘటనలు కేసీఆర్, బీఆర్ఎస్ దళిత వ్యతిరేక ఆలోచనా విధానానికి నిదర్శనమని, నిర్దిష్టమైన ఆదేశాలు లేకుండా ఇవి జరిగే అవకాశం లేదన్నది దళిత సంఘాల భావన. అసెంబ్లీ వేదికగా సైతం పలువురు ఎమ్మెల్యేలు.. ‘‘బీఆర్ఎస్ ఓ దళిత వ్యతిరేక పార్టీ. దాని అధినేత కేసీఆర్ దళిత వ్యతిరేకి.’’ అంటూ వ్యాఖ్యానించారు. కేవలం కామెంట్లకే పరిమితం కాకుండా పలు ఉదాహరణలను సైతం ప్రస్తావించారు.

వీటన్నింటినీ గమనంలోకి తీసుకున్న దళిత సంఘాలు పార్టీలకు అతీతంగా దళిత ప్రజా ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు నిలబడితే వారిని ఓడించడమే లక్ష్యంగా ఈ కార్యాచరణ ఉండనున్నది. అయితే, ఎలాంటి వేదిక ఉనికిలోకి వస్తుంది.. దీనికి ఎవరు శ్రీకారం చుడతారు.. యాక్షన్ ప్లాన్ను అమలు చేయడానికి బాధ్యత తీసుకునేదెవరు?.. జిల్లా స్థాయిలో ఉద్యమంగా రూపొందించడానికి చేపట్టాల్సిన చర్యలు.. ఇలాంటివన్నీ త్వరలో రూపుదిద్దుకోనున్నాయి.

బీఆర్ఎస్‌ను ‘మైల పార్టీ’గా ప్రకటించే ఆలోచన

దళితులు నడిచిన నేలను బీఆర్ఎస్ మైలగా భావిస్తే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ‘మైల పార్టీ’గా ప్రకటించి దళిత సమాజానికి బలమైన పిలుపునివ్వాలన్నది ఆ సంఘాల భావన. ఆ పార్టీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలన్న ఆలోచన కూడా వ్యక్తమవుతున్నది. అవసరమైతే ఈ అంశంపై న్యాయపోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలని సంఘాలు నిర్ణయించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ తరఫున కేసీఆర్ క్షమాపణ చెప్పినా.. అది మొక్కుబడిగానే ఉంటుందని, దాన్ని నమ్మి ఉద్యమ నిర్మాణం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఒక దళిత సంఘం బలంగా వ్యాఖ్యానించింది. అన్ని జిల్లాల్లో ఈ వేదిక యూనిట్లను ఏర్పాటు చేసి, బీఆర్ఎస్‌ను యావత్తు దళిత సమాజం బహిష్కరించాలన్న ఏకైక ఎజెండాతోనే ఈ వేదిక ఏర్పాటు కావాలని, ఆ లక్ష్యంతోనే కార్యాచరణ కూడా ఉండాలని భావిస్తున్నట్లు వివరించారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>