మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా.. భీకర దాడులు!

కలం, నేషనల్ డెస్క్: పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. అమెరికా, ఇరాన్ (US Iran) దేశాల మధ్య పూటపూటకూ పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. ఇప్పుడు ప్రత్యక్ష పోరుకు దారి తీస్తోంది. పశ్చిమాసియా సముద్ర తీరంలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న క్షిపణి దాడులు, డ్రోన్ల కూల్చివేతలు, ఆయిల్ ట్యాంకర్ల విధ్వంసంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉండగా ఈ రెండు దేశాలు మళ్లీ భీకర దాడులకు దిగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది.

ఐఆర్జీసీ సైనిక చర్య..

అమెరికా రక్షణ రంగానికి చెందిన అత్యాధునిక ‘డైవ్-ఎల్డీ’ అనే అన్‌మ్యాన్డ్ సబ్‌మెరైన్‌ను హోర్ముజ్ జలసంధిలో తమ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) బుధవారం ప్రకటించింది. దీంతో పాటు అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూడా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా కూల్చివేసినట్లు వెల్లడించింది. అయితే తమ డ్రోన్ సాంకేతిక లోపం వల్లనే సముద్రంలో కూలిపోయిందని అమెరికా మిలిటరీ స్పష్టం చేసింది. అది పాత మోడల్ అని, దానివల్ల ఎలాంటి రహస్య డేటా లీక్ కాదని పెంటగాన్ తెలిపింది.

ప్రతీకారంగానే దాడులు..

గత రెండు రోజుల్లో తమ యుద్ధనౌకపై ఇరాన్ క్షిపణి దాడులకు తెగబడటంతో దానికి ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన 5 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను అమెరికా బలగాలు ధ్వంసం చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. సైనిక చర్యలతో పాటు ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఇరాన్‌కు చెందిన 27 ఎయిర్‌లైన్స్ కంపెనీలపై నిషేధం విధిస్తూ ఆంక్షల జాబితాలో చేర్చింది. ఈ విమానయాన సంస్థలు ఆయుధాల సరఫరా, సైనిక రవాణా కోసం ఇరాన్ ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని అమెరికా ఆరోపించింది.

తగ్గేదే లేదు అంటున్న ఇరాన్..

ఉద్రిక్త పరిస్థితులపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందిస్తూ.. తమ దేశం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదని, కానీ ఆక్రమణదారులు పశ్చాత్తాపపడేలా తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి పట్టుదలతో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా టెహ్రాన్‌పై సంయుక్త దాడులు చేయగా.. ఇరాన్ కూడా క్షిపణులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. జూన్ 18న ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారం ఆగస్టు 17తో 60 రోజుల చర్చల గడువు ముగిసింది. అయితే, తాజా ఘర్షణలతో ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భగ్గుమన్న క్రూడాయిల్ ధర..

హార్మూజ్ జలసంధి పరిసరాల్లో కొత్త నిషేధిత జోన్ అమలు చేస్తున్నట్లు ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండు అమెరికా మిలిటరీ నౌకలు, ఎనిమిది ఆయిల్ ట్యాంకర్లతో పాటు మరో 10 వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడం, ఆయిల్ ట్యాంకర్లపై దాడులు పెరగడంతో క్రూడాయిల్ రేట్లు భగ్గుమన్నాయి. ముడి చమురు సప్లై నిలిచిపోతుందనే భయాలతో బుధవారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>