కలం, ఖమ్మం బ్యూరో: ఒకప్పుడు బొగ్గు గనుల సైరన్ మోతలు, కార్మికుల శ్రమ, ప్రశాంత వాతావరణానికి పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) పారిశ్రామిక ప్రాంతంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న వరుస ఘర్షణలు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. మణుగూరు నుంచి పాల్వంచ వరకు ప్రధాన రహదారులు, పట్టణ కేంద్రాల్లో చిన్నపాటి వివాదాలు సైతం తీవ్ర ఘర్షణలకు దారితీస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి.
మణుగూరు హత్యతో కలకలం
మణుగూరు పట్టణంలో ఇటీవల సింహాద్రి శివకుమార్ అలియాస్ శివ హత్య ఘటన జిల్లాలో పెరుగుతున్న గ్యాంగ్ సంస్కృతిపై చర్చకు దారితీసింది. హైదరాబాద్‌లో ఇంటీరియర్ పనులు చేసుకునే శివ.. తన స్నేహితుడి చెల్లెలిని వేధిస్తున్న లోకేష్ అనే యువకుడిని మందలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని లోకేష్ తన గ్యాంగ్ లీడర్‌గా పేర్కొంటున్న ‘జెట్ పట్’ రమ్యాకాంత్ అలియాస్ జెట్టి దృష్టికి తీసుకెళ్లడంతో వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా మణుగూరుకు వస్తే చంపేస్తామని ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఆగస్టు 27న మణుగూరుకు వచ్చిన శివపై నేతాజీ గ్రౌండ్ సమీపంలో దాడి జరగగా ఆయన మృతి చెందారు. ఈ ఘటనలో 27 మందిని పోలీసులు అరెస్టు చేసి, బైక్‌లు, సెల్‌ఫోన్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితుల్లో పలువురు యువకులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
పాల్వంచలోనూ రౌడీ మూకల హల్‌చల్
గ్యాంగ్ తరహా ఘర్షణలు మణుగూరుకే పరిమితం కాకుండా పాల్వంచలోనూ కనిపిస్తున్నాయి. పాత పాల్వంచలోని సాయినగర్ కాలనీలో ఇటీవల ఆస్తి వివాదం నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకుంది. రుద్రంపూర్ నుంచి కొందరిని రప్పించి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా ఓ ఆటో ధ్వంసమైనట్లు సమాచారం. దాడి సమయంలో కొందరు నిందితులు రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. అయితే ఈ ఆరోపణలపై పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
చిన్న వివాదాలే.. పెద్ద ఘర్షణలు
మరోవైపు, సాధారణ జీవితంలోనూ సహనం తగ్గిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 5న మణుగూరు ప్రధాన రహదారిపై ఆటో, లారీ డ్రైవర్ల మధ్య ఓవర్‌టేకింగ్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. రోడ్డుపైనే పరస్పరం వాగ్వాదం, తోపులాటకు దిగడంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. చివరకు స్థానికులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది.
మత్తు పదార్థాలపై ఆందోళన
జిల్లాలో గంజాయి, అక్రమ మద్యం వంటి మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మత్తు ప్రభావంతో యువత విచక్షణ కోల్పోవడం, సోషల్ మీడియాలో హింసాత్మక, విలనిజం తరహా కంటెంట్ ప్రభావంతో గ్యాంగులుగా ఏర్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు రాజకీయ నాయకుల అండదండలు లభిస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ అంశాలపై ఆధారాలతో కూడిన సమగ్ర దర్యాప్తు అవసరం.
కఠిన చర్యలకు డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జిల్లావాసులు కోరుతున్నారు. గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రౌడీ మూకలు, గ్యాంగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నపాటి వివాదాలు ప్రాణాంతక ఘర్షణలుగా మారకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, యువతను నేరాల వైపు ఆకర్షించే పరిస్థితులను నియంత్రించడం, నేరస్థులకు రాజకీయ అండ ఉందన్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం ద్వారా జిల్లాలో తిరిగి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

