కలం, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల విద్యాధికారి సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఎంఈఓ నరసింహులును (MEO Narasimhulu) సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని విజ్ఞాన్ కాన్సెప్ట్ స్కూలు అనధికారికంగా నిర్వహిస్తుండడంతో గతంలోనే గుర్తింపును రద్దు చేశామని తెలిపారు.
ఈ నేపథ్యంలో పాఠశాలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకోవడంలో, ప్రభుత్వానికి తప్పనిసరిగా సమర్పించాల్సిన క్లోజర్ రిపోర్టును సమర్పించడంలో సంబంధిత ఎంఈఓ విఫలమైనట్లు ఇటీవల గుర్తించామన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్ సంబంధిత పాఠశాలపై విచారణ చేశారని తెలిపారు. ఇందులో ఎంఈఓ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నివేదిక రావడంతో సస్పెండ్ చేసినట్లు డీఈఓ పేర్కొన్నారు.

