యామిని ఆస్పత్రిలో కలకలం.. పసికందు మృతిపై ఆందోళన

కలం, ఖమ్మం బ్యూరో: చనిపోయిన పసికందును ఐసీయూలోనే ఉంచి చికిత్స కొనసాగుతోందంటూ రూ.80 వేల బిల్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా కేంద్రంలోని యామిని హాస్పిటల్‌పై (Yamini Hospital) కలకలం రేపాయి. ఆస్పత్రి యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన గిరిజన దంపతులు కిరణ్, యశోదలకు ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. బాలుడికి తీవ్రమైన నిమ్ము చేయడంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కొత్తగూడెంలోని యామిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాలుడిని పరిశీలించిన వైద్యులు ఐసీయూలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే, ఆ తర్వాత తల్లిదండ్రులు, బంధువులను ఐసీయూలోకి అనుమతించలేదని వారు ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం వరకు బాలుడిని చూపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించగా రూ.80 వేల బిల్లు చెల్లిస్తేనే బాలుడిని అప్పగిస్తామని, లేదంటే చికిత్స నిలిపివేస్తామని చెప్పినట్లు బాధితులు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన బంధువులు ఐసీయూలోకి వెళ్లి చూడగా బాలుడు మృతి చెందిన స్థితిలో కనిపించాడని పేర్కొన్నారు. మంగళవారం రాత్రే బాలుడు మృతి చెంది ఉండవచ్చని, ఆ విషయాన్ని దాచిపెట్టి చికిత్స పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనతో వారు కన్నీరుమున్నీరయ్యారు.

విషయం తెలుసుకున్న బంధువులు, స్థానికులు ఆస్పత్రి ఎదుటకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆస్పత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించి, బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>