కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanamkonda) అదాలత్ సెంటర్ లోని ప్రముఖ లింగాల కేదారి ఫుడ్ కోర్ట్ (Kedari Food Court)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ దుర్ఘటనలో హోటల్ యజమాని లింగాల కేదారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆయనతో పాటు ఉన్న భార్య తీవ్రంగా గాయపడ్డారు. 80 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్న ఆమెను 108 సిబ్బంది అత్యవసర చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో వేలాది మంది ఉద్యమకారులకు అతి తక్కువ ధరకే భోజనం అందించి కేదారి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

