కలం, కరీంనగర్ బ్యూరో: వినాయక చవితి వచ్చిందంటే చాలు కరీంనగర్ పాత బజార్ భక్తజన సముద్రాన్ని తలపిస్తుంది. గత 29 ఏళ్లుగా అత్యంత వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న ‘గోల్డెన్ యూత్’ సంఘం (Karimnagar Golden Youth), కరీంనగర్ నగరంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
ప్రతి ఏటా వినూత్న భావనలతో, వైవిధ్యభరితమైన అవతారాలలో భారీ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించడం వీరి ప్రత్యేకత. ఈ ఏడాది (29వ సంవత్సరం) భక్తులను కనువిందు చేసేందుకు గణనాథుడు ‘మహాదేవ’ అవతారంలో కొలువుదీరడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో పాత బజార్ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ, సందడి వాతావరణం నెలకొంది.
ఏటా ఒక ప్రత్యేక అవతారం..
గోల్డెన్ యూత్ నిర్వాహకులు ప్రతి ఏటా వినాయకుని రూపంలో కొత్తదనాన్ని ఆవిష్కరిస్తున్నారు. 2024 లో నవరస గణనాథుల రూపంలో, 2025 లో సప్త చిరంజీవుల అవతారంలో, ఈ ఏడాది (2026) అత్యంత ఆకర్షణీయమైన ‘మహాదేవ’ రూపంలో దర్శనమిస్తున్నారు. ప్రత్యేకమైన డిజైన్‌ను రూపొందించి, దానికి అనుగుణంగా నైపుణ్యం కలిగిన కళాకారులు సుమారు 60 రోజుల పాటు శ్రమించి ఈ భారీ ‘మహాదేవ’ గణపతి విగ్రహానికి తుది రూపం ఇచ్చారు. ఈ విగ్రహ తయారీకే రూ. 5.5 లక్షల నుండి 6.5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
నలుమూలల నుండి భక్తజనం..
గోల్డెన్ యూత్ ఏర్పాటు చేసే భారీ విగ్రహంతో పాటు మండపంలో నిలిపే ఆకర్షణీయమైన అలంకరణలు, లైటింగ్ ఏర్పాటు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ప్రతిమను, ఉత్సవ వైభవాన్ని తిలకించేందుకు కరీంనగర్ పట్టణంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. దీనితో పాత బజార్ వీధులన్నీ నవరాత్రుల పొడవునా భక్తులతో కిటకిటలాడుతుంటాయి.
రూ. 22 లక్షల బడ్జెట్ – భక్తులకు సౌకర్యాలు
ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు గాను మొత్తం రూ. 22 లక్షలు వెచ్చిస్తున్నట్లు గోల్డెన్ యూత్ ముఖ్య నిర్వాహకుడు కోడూరి అంబరీష్ గౌడ్ తెలిపారు. “చిన్నతనం నుంచే భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు ప్రారంభించాం. ప్రజలకు ప్రతి ఏటా ఒక కొత్తదనాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ వినూత్న అవతారాలను కొలువుదీరుస్తున్నాం. ఉత్సవాల నిర్వహణతో పాటు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అదే స్థాయిలో ఘనంగా నిర్వహిస్తాం. ఈ 9 రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం (భోజనం), రాత్రి అల్పాహార ప్రసాద వితరణ ఉంటుంది. రద్దీ నియంత్రణ, భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.” అని తెలిపారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అంబరీష్ పేర్కొన్నారు. 29 ఏళ్ల ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నగరవాసులు, భక్తులు అందిస్తున్న ఆదరణే తమకు ప్రధాన ప్రోత్సాహమని.. ఈసారి కూడా తెలంగాణ వ్యాప్తంగా గుర్తుండిపోయేలా ‘మహాదేవ’ గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని వెల్లడించారు.

