కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) కోరారు. అసెంబ్లీలో బుధవారం సీఎంని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగర అభివృద్ధి కోసం స్పెషల్ ఫండ్ రూ. 200 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ కళాశాల మంజూరు చేయాలని ధన్ పాల్ కోరారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను దృష్టి పెట్టుకొని ఔటర్ రింగ్ రోడ్ లను మంజూరు చేయాలన్నారు. గతంలోనూ అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రధానంగా ఇందూరులో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని, కళాభారతి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే వివరించారు.
రాజారాం స్టేడియం ఆధునికీకరణతో పాటు పాత కలెక్టరేట్ మైదానంలో సింథటిక్ ట్రాక్ తో కూడిన స్టేడియం, అలాగే ఇండోర్ స్టేడియం మంజూరు చేయాలని ధన్ పాల్ కోరారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇందూరు ఖిల్లా రామాలయం అభివృద్ధితో పాటు రెవెన్యూ శాఖ నుంచి దేవాదాయ శాఖకు బదిలీ చేయాలన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో మరమ్మత్తులు, మౌలిక సౌకర్యాలకు నిధులు విడుదల చేయాలని, వైద్యులు సిబ్బంది కొరత లేకుండా చూడాలని కోరారు. ముఖ్యంగా బస్టాండ్ ఆధునికీకరణ పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

