కలం, జగిత్యాల: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ డ్రైవర్ల ప్రధాన లక్ష్యంగా ఉండాలని జగిత్యాల జిల్లా ఎస్పీ (Jagtial SP) అశోక్ కుమార్ (Ashok Kumar) సూచించారు. జగిత్యాల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణపై బుధవారం నిర్వహించిన డ్రైవర్ల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రైవర్లు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ప్రమాదకర ఓవర్‌టేకింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. మలుపులు, కూడళ్లు, వంతెనలు, రద్దీ ప్రాంతాలు, పాఠశాలలు, మార్కెట్ల వద్ద తప్పనిసరిగా వేగాన్ని నియంత్రించాలని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకూడదని, ఇతర వాహనదారుల కదలికలను ముందుగానే అంచనా వేసి డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించాలని సూచించారు. ప్రయాణికులను నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేర్చడం కంటే వారి ప్రాణాలకు భద్రత కల్పించడమే అత్యంత ముఖ్యమని ఎస్పీ స్పష్టం చేశారు.
ముగ్గురు ఉత్తమ డ్రైవర్లకు సన్మానం
ప్రమాదరహితంగా విధులు నిర్వహించిన ముగ్గురు ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్లను ఎస్పీ అశోక్ కుమార్ శాలువాలతో సన్మానించి అభినందించారు. ఇతర డ్రైవర్లు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ప్రమాదరహిత డ్రైవింగ్‌కు కట్టుబడి విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, డీటీఓ మహమ్మద్ సందాని, ఆర్టీసీ ఆర్ఎం రాజు, డిప్యూటీ ఆర్ఎం భూపతి రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, డిపో మేనేజర్లు రమేష్, మనోహర్, హరి, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్‌తో పాటు ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

