కలం, తెలంగాణ బ్యూరో: శాసనమండలి నుంచి ప్రస్తుత సెషన్‌కు సస్పెన్షన్లకు గురైన ఇద్దరు సభ్యులను పూర్తిగా బహిష్కరించే (BRS MLCs Expulsion) అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిని ఈ సెషన్ వరకు సభకు హాజరు కాకుండా చైర్మన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సస్పెన్షన్ బహిష్కరణగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టి, అన్ని పార్టీల సభ్యుల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ఓటింగ్ ద్వారా ఇద్దరినీ సభ నుంచి బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.
సాధారణ ఓటింగ్.. లేదంటే డివిజన్ ఓటింగ్
కౌన్సిల్ సమావేశం బుధవారం ప్రారంభం కాగానే, ప్రభుత్వం తరఫున ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది. చర్చ అనంతరం అవసరమైతే సాధారణ ఓటింగ్ లేదా డివిజన్ ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ స్పీకర్‌ను దూషించిన వ్యవహారంలో తాతా మధు(Tata Madhusudan), నవీన్ రెడ్డి(Naveen Kumar Reddy)పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు ఇప్పటికే డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సభ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని, దానికి ఆమోదం తెలుపుతామని స్పష్టం చేశారు.
2028 వరకు పదవీకాలం
అయితే తాతా మధు ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా 2022 జనవరిలో ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028 జనవరి వరకు ఉంది. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 2024 జనవరిలో నవీన్ రెడ్డి ఎన్నికయ్యారు. అంతకుముందు ఈ స్థానంలో కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికలో నవీన్ రెడ్డి విజయం సాధించారు.
దీంతో ఆయన పదవీకాలం కూడా 2028 జనవరి వరకు కొనసాగాల్సి ఉంది. ఇప్పుడు ఇద్దరిపై బహిష్కరణ వేటు పడితే, వారి పదవీకాలం గడువు ముగియడానికి దాదాపు ఏడాదిన్నర ముందే ఎమ్మెల్సీ పదవులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిర్ణయాన్ని వారు హైకోర్టులో సవాలు చేస్తారా? లేదా? అన్నది వారిద్దరితోపాటు బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
గతంలోనూ ఇటువంటి చర్చ
2018లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లపై అప్పటి స్పీకర్ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంపై సభలో చర్చ జరిగినప్పుడు నిబంధనల ప్రకారం వారు సభలో లేరు. సభ్యుడిపై బహిష్కరణకు సంబంధించిన చర్చ జరుగుతున్న సమయంలో సంబంధిత సభ్యుడు సభలో ఉండకూడదన్న నిబంధన ప్రకారం ఇప్పుడు శాసనమండలిలోనూ తాతా మధు, నవీన్ రెడ్డిపై ఇదే తరహాలో (BRS MLCs Expulsion) చర్చ జరిగే అవకాశం ఉంది.
Also Read : ఇంత అవమానమా?: సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా మురళీధర్‌రావు!
Follow Us On: X(Twitter)

