కలం, సోన్ : వినాయక చవితి ఉత్సవాల కోసం తీసుకెళ్తున్న భారీ వినాయకుడి విగ్రహం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ నుంచి కిందపడిపోయిన ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం (Soan Mandal) కడ్తాల్ గ్రామ బైపాస్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన యువకులు నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్‌లో 15 అడుగుల వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేశారు. అనంతరం విగ్రహాన్ని ట్రాక్టర్ పై ఏర్పాటు చేసుకుని ఆలూరుకు తరలిస్తుండగా.. కడ్తాల్ బైపాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై ఒక్కసారిగా విగ్రహం ట్రాక్టర్ నుంచి కిందపడిపోయింది. భారీ విగ్రహం రోడ్డుపై పడటంతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. అయితే అదే సమయంలో జాతీయ రహదారిపై ఇతర వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో యువకులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

