యువత వాయిస్‌.. వికసిత్‌ భారత్‌ ఛాయిస్‌

కలం, మహబూబ్‌నగర్‌ బ్యూరో: వికసిత్‌ భారత్‌ @2047 లక్ష్య సాధనలో యువతను క్రియాశీల భాగస్వాములుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌–2027 (VBYLD–2027) కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన అధికారి కోట నాయక్‌ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా నెహ్రూ యువ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. దేశాభివృద్ధి, సామాజిక ప్రగతి, ఆవిష్కరణలు, నాయకత్వ రంగాల్లో యువతలోని ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయి వేదికపై ప్రదర్శించడమే VBYLD–2027 ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

జాతీయ యువజనోత్సవాన్ని మరింత విస్తృత స్థాయిలో నిర్వహించడంతో పాటు యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, వారి ఆలోచనలు, అభిప్రాయాలకు ప్రాధాన్యం కల్పించడం కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. **వికసిత్‌ భారత్‌ @2047 నిర్మాణంలో యువత ఆలోచనలు, సృజనాత్మకత, నైపుణ్యాలు కీలకమని** అన్నారు.

తొలిదశలో వికసిత్‌ భారత్‌ క్విజ్‌

VBYLD–2027లో భాగంగా తొలిదశలో వికసిత్‌ భారత్‌ క్విజ్‌ నిర్వహిస్తున్నట్లు కోట నాయక్‌ తెలిపారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువత ఈ క్విజ్‌లో పాల్గొనేందుకు అర్హులని, సెప్టెంబర్‌ 30లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. క్విజ్‌లో భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, అభివృద్ధి ప్రయాణం, దేశం సాధించిన విజయాలు, వికసిత్‌ భారత్‌ @2047 లక్ష్యాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఉంటాయని వివరించారు. క్విజ్‌లో ప్రతిభ కనబరిచిన వారిని తదుపరి దశలకు ఎంపిక చేస్తామని తెలిపారు. అనంతరం వ్యాసరచన, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల ద్వారా ప్రతిభావంతులను గుర్తించి జాతీయ స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు.

జాతీయ వేదికపై ఆలోచనలు చెప్పే అవకాశం

తుది దశకు ఎంపికైన యువతకు తమ ఆలోచనలు, అభిప్రాయాలు, దేశాభివృద్ధికి సంబంధించిన సూచనలను జాతీయ స్థాయి వేదికపై ప్రముఖుల సమక్షంలో వెల్లడించే అవకాశం ఉంటుందని కోట నాయక్‌ తెలిపారు.“Your Voice Can Shape a Viksit Bharat” అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యువతలో నాయకత్వ స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు దేశ నిర్మాణంలో వారి పాత్రను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో క్విజ్‌లో పాల్గొనాలని ఆయన కోరారు. యువత ఉద్యోగావకాశాలకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్‌ నిర్మాణంలో తమ ఆలోచనలు, నైపుణ్యాలు, సృజనాత్మకతతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మై భారత్‌–మహబూబ్‌నగర్‌ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>