కలం, రాజన్న సిరిసిల్ల: ఏడు ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటి దాదాపు నాలుగు ఏండ్ల తరువాత 15 టన్నుల దిగుబడితో రూ.3,45,000 ఆదాయం పొందారు ముస్తాబాద్ మండలం నామాపూర్ కు చెందిన రైతు అరవెల్లి చంద్రశేఖర్ రావు (Oil Palm Farmer). దాదాపు నాలుగు ఏండ్ల క్రితం మొక్కలు నాటి సస్య రక్షణ చర్యలు చేపట్టి మంచి దిగుబడి సాధించి.. ఇప్పుడు మరో రెండు ఎకరాల్లో మామిడి, నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. ఈ ఆదర్శ రైతు వ్యవసాయ క్షేత్రానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం వెళ్లి పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో మొక్కలు, దిగుబడిని పరిశీలించి..మరో పంట ఎప్పుడు చేతికి వస్తుందని అడిగి తెలుసుకున్నారు.
రైతును అభినందించిన కలెక్టర్..
ఎన్ని ఎకరాల్లో ఆయిల్ పామ్ వేశారు? మొక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? డ్రిప్ ఇరిగేషన్.. సస్య రక్షణ చర్యలు, పెట్టుబడి.. ఆదాయం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఆ రైతును అభినందించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రైతులు దీర్ఘకాలిక ఆదాయం సమకూర్చే ఆయిల్ పామ్ వైపు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం సబ్సిడీ పై అందించే మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇలా ఆదాయం పొందొచ్చు..
మూడు ఏండ్లపాటు అంతర పంటలుగా ఉద్యానవన శాఖా అధికారుల సూచనల మేరకు కూరగాయలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు సాగు చేసి ఆదాయం పొందవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ సాగులో కోతుల బెడద, చీడపీడల ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఇప్పుడు ఆయిల్ టన్ను ధర 24 వేల 25 రూపాయలుగా ఉందని వెల్లడించారు. జిల్లాలో ఆయిల్ పామ్ కలెక్షన్ కేంద్రాలు నామాపూర్, బోయినపల్లి, నేరెళ్ల, సిరిసిల్ల ఉన్నాయని వెల్లడించారు. ఇక్కడి ఆయిల్ పామ్ ఉత్పత్తులు సిద్ధిపేట జిల్లాలో ఉన్న నర్మెట్ట వద్ద ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని తెలిపారు.
రైతులు ముందుకు రావాలి..
ఎక్కువ మంది రైతులు ఆయిల్ సాగు చేసేందుకు ముందుకు వస్తే మరిన్ని ఆయిల్ పామ్ కలెక్షన్ కేంద్రాలు ప్రారంభించొచ్చని కలెక్టర్ వివరించారు. ఎన్నో లాభాలు ఉన్న ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు. నామాపూర్ రైతు ఆయిల్ పామ్ తో పాటు ఇప్పుడు మామిడి, నిమ్మ తోట సాగు చేస్తున్నారని, దీంతో మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఏడీఏ ప్రదీప్, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీఓ లచ్చాలు తదితరులు ఉన్నారు.

